పుట:Mana-Jeevithalu.pdf/81

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
72
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

భవితవ్యం ఎంత అనిశ్చయంగా ఉంటుందో మన మధ్యస్తస్థితి కూడా అంత అనిశ్చయంగానూ ఉంటుంది. కేవలం మాటలే అసాధారణమైన ప్రాముఖ్యం కలవిగా కనిపిస్తాయి మనకి. అవి కలిగించే మానసిక ప్రభావంతో, వాటివల్ల కలిగే అనుభూతులే అత్యంత ముఖ్యమైనవనిపిస్తాయి, ఆ ప్రతీక కవతల ఏమున్నదో దానికంటే కూడా.

సంకేతం, ఊహారూపం, జండా, మాట, ఇవన్నీ ఎంతో ముఖ్యం మనకి. నకిలీదేగాని నిజంకాదు మన శక్తి. ఇతరుల అనుభవాల గురించి చదువుతాం. ఇతరులు ఆడుతూంటే చూస్తాం, ఇతరుల ఉదాహరణలను అనుసరిస్తాం, ఇతరులు చెప్పినదాన్ని వర్ణిస్తాం. మనం లోపల శూన్యంగా ఉంటాం. ఈ శూన్యతని మాటలతోనూ అనుభూతులతోనూ, ఆశలతోనూ, ఊహలతోనూ నింపటానికి ప్రయత్నిస్తాం. కాని, ఆ శూన్యత అలాగే ఉంటుంది.

పునశ్చరణ, దాని అనుభూతులూ ఎంత ఆనందకరమూ, గౌరవ ప్రదమూ అయినప్పటికీ, అది అనుభవం పొందటం కాదు. ఒక పూజ, ఒకమాట, ఒక ప్రార్థన నిరంతరం పదేపదే పునశ్చరణ చేయటం వల్ల తృప్తికరమైన అనుభూతి కలుగుతుంది. దానికే ఎంతో గౌరవప్రదమైన పేరు పెడతారు. కాని, అనుభవం పొందటం అనుభూతి కాదు. ఇంద్రియ ప్రతిక్రియ వెంటనే వాస్తవికతకి చోటిస్తుంది. వాస్తవమైన దాన్ని, అంటే, "ఉన్నదాన్ని" కేవలం ఇంద్రియ జ్ఞానం ద్వారా అర్థం చేసుకోలేము. ఇంద్రియాల పాత్ర కొంతవరకే ఉంటుంది. కాని, అవగాహన గాని, అనుభవం పొందటం గాని, ఇంద్రియాలకు అతీతమైనది. అనుభవం పొందటం అయిపోయిన తరువాతనే అనుభూతి ముఖ్యమవుతుంది. అప్పుడు మాటలు అర్థవంత మవుతాయి. సంకేతాలు ఆధిక్యం చూపిస్తాయి. అప్పుడు గ్రామఫోను ఎంతో ఆనందదాయకమవుతుంది. అనుభవం పొందటం కొనసాగేది కాదు. కొనసాగేది అనుభూతి మాత్రమే, ఏ స్థాయిలోనైనా. అనుభూతి మళ్లీ కలిగినప్పుడు కొత్త అనుభవాన్ని పొందిన అనుభూతి కలుగుతుంది. కాని అనుభూతులు ఎప్పటికీ క్రొత్తవికావు. పునశ్చరణ చేసుకున్న అనుభూతులలో క్రొత్త దానికోసం వెతికి లాభం లేదు. అనుభవం పొందుతూన్న స్థితిలోనే క్రొత్తది ఉద్భవిస్తుంది. అనుభూతి కోసం ఆరాటం, ప్రయాస అంతమైనప్పుడే