పుట:Mana-Jeevithalu.pdf/78

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
69
భోగభాగ్యాలను త్యజించటం

మనల్ని మనం ఎందుకు నమ్మించుకోవటం? వేటి నుంచైనా స్వేచ్ఛ పొందటానికి వివేకం కావాలి, అంతేకాని నిదర్శనాలూ, నమ్మకాలూ కాదు. వివేకం వ్యక్తిగతమైనది కాదు. సంపద లెక్కువగా ఉంటే ఏం జరుగుతుందో అంతా గ్రహించినట్లయితే, ఆ గ్రహింపే స్వేచ్ఛను కలుగజేస్తుంది. అటువంటప్పుడు గంభీరంగా ఉద్ఘాటించటాలూ, నిదర్శనంగా చేసి చూపించటాలూ అవసరంకావు. ఈ వివేకవంతమైన అవగాహన పని చేయనప్పుడే, క్రమశిక్షణలు, బంధనాలను తెంచుకోవట మొదలైన వాటిని మొదలు పెడతాం. ఎక్కువ, తక్కువ, అన్నది కాదు ముఖ్యం. వివేకం ముఖ్యమైనది. వివేకవంతుడైన మనిషి కొంచెంతోనే తృప్తిపడి, అధిక సంపదలు లేకుండా స్వేచ్ఛగా ఉంటాడు.

కాని సంతుష్టి పడటం అనేది ఒకటి, నిరాడంబరత వేరొకటి. సంతుష్టి పొందాలనే కోరిక గాని, నిరాడంబరంగా ఉండాలనే కోరికగాని బంధనం అవుతుంది. కోరిక చిక్కులు కల్పిస్తుంది. ఉన్నదాన్ని గ్రహించటం వల్ల తృప్తిపడటం జరుగుతుంది. ఉన్న దాంట్లో స్వేచ్ఛగా ఉన్నప్పుడు నిరాడంబరత వస్తుంది. పైకి నిరాడంబరంగా ఉండటం మంచిదే. కాని అంతర్గతంగా కూడా నిరాడంబరంగా నిర్మలంగా ఉండటం మరింత ముఖ్యం. నైర్మల్యం మనోదీక్షతోనూ, కర్తవ్యభారంతోనూ రాదు. మనస్సు దాన్ని సృష్టించలేదు. మనస్సు తన్ను తాను ఇముడ్చుకోగలదు, సర్దుకోగలదు, తన తలపులన్నిటినీ ఒక తీరులో పెట్టుకోగలదు. కాని, ఇది నైర్మల్యంగానీ నిరాడంబరత గానీ కాదు.

సంకల్ప పూర్వకమైన చర్య సంధిగ్ధతను కలుగజేస్తుంది. సంకల్పం ఎంత పవిత్రమైనదైనా కోరికకు మూలమవుతుంది. ఏదో అందుకోవాలనీ, మరేదో అవాలనే సంకల్పం ఎంత అవసరమైనదైనా, పవిత్రమైనదైనా, ఒక మార్గాన్ని సూచించి, సందిగ్ధతలోనే ఒక దారి కల్పిస్తుంది. కాని అటువంటి ప్రక్రియ ఒంటరితనానికి దారి తీస్తుంది. ఒంటరితనం వల్ల నైర్మల్యం రాదు. సంకల్పయుక్తమైన చర్య తాత్కాలికంగా కార్యోన్ముఖం కావటానికి కొంతవరకు దారి చూపించినా, దాని గతాన్ని తుడిచి పెట్టేయటం దాని వల్లకాదు ఎన్నటికీ, ఎందువల్లనంటే, సంకల్పం అనేది గతం నుంచి వచ్చినది కనుక. మన గతమే సంకల్పాన్ని పుట్టించి పోషిస్తుంది. ఆ సంకల్పం గతానికి