పుట:Mana-Jeevithalu.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

68

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

త్యజించాడు. ఆయనకి చాలా ఆస్తిపాస్తులుండేవి. వాటి బరువు బాధ్యతలతో ఆయన సంతోషంగా ఉండేవాడు. ఆయన దానధర్మాలు చేసేవాడు. ఆయనది రాతి గుండె కాదు. వెనకా ముందూ ఆలోచించకుండా ఇచ్చేవాడు. ఇచ్చాక దాని సంగతి మరిచిపోయేవాడు. తనకు తోడ్పడిన వాళ్లతో మంచిగా ఉండేవాడు. వారికి లాభదాయకంగా ఉండేట్లు చేసేవాడు. డబ్బు సంపాదించటమే ప్రధానం అయిన ఈ ప్రపంచంలో ఆయన డబ్బు సులభంగానే సంపాదించాడు. ఆయన కొందరి లాగ, తమ కంటె తమ బాంక్ ఎకౌంట్లు, వడ్డీ వ్యాపారాలే ఎక్కువై, ఒంటరిగా ఉండి, జనానికి, వాళ్లు అడిగే వాటికీ భయపడుతూ, చిత్రమయిన ధనిక వాతావరణంలో తమ్ముతాము బంధించుకునే రకం కాదు. ఆయన కుటుంబానికి ఆయనంటే భయం లేదు. అలాగని అంత సులభంగా లొంగేవాడూ కాదు. ఆయనకి చాలామంది స్నేహితులున్నారు, ఆయన ధనం చూసి కాదు. ఆయన ఎందుకు తన ఆస్తిపాస్తుల్ని త్యజించాడో చెప్పుకొస్తున్నాడు. ఓ రోజున ఏదో చదువుతూంటే హఠాత్తుగా తట్టిందట - (ఇప్పుడు ఆయనకున్నది అతి స్వల్పం) ఆ డబ్బు సంపాదించటమూ, తన ధనమూ - అంతా ఎంత తెలివితక్కువ తనమో. నిరాడంబరమైన జీవితాన్ని సాగించటానికి ప్రయత్నిస్తున్నాడు. అదంతా దేనికోసమంటే, అసలు భౌతిక వాంఛల్ని మించిన దేదైనా ఉన్నదా అని కనుక్కునేందుకు.

కొంచెంతో తృప్తిపడి ఉండటం కొంతవరకు సులభమే. వేరే దేనికోసమో వెతుకుతూ ప్రయాణం చేసే వారికి తక్కిన బరువులన్నీ వదిలించుకుని స్వేచ్ఛగా ఉండటం కష్టం కాదు. అంతరంగ అన్వేషణ కోసం పడే తపన అధిక సంపదలు కలిగించే సందిగ్ధతని తొలగిస్తుంది. కాని పైపై వాటి నుంచి స్వేచ్ఛ పొందినంత మాత్రాన నిరాడంబరంగా జీవించటం అవదు. అంతరంగిక ప్రశాంతత నిష్కపటత్వం అనటానికి వీల్లేదు. పైకి నిరాడంబరంగా జీవించటం మంచిదే, అది కొంత వరకు స్వేచ్ఛ నిస్తుంది కాబట్టి. చిత్తశుద్ధికి అదొక నిదర్శనం. అయితే, ఎప్పుడూ ముందుగా పైపై వాటితోనే మొదలు పెడతామెందుకు? హృదయ నిరాడంబరతతో ఎందుకు ఆరంభించం? మనల్నీ, ఇతరుల్నీ మన ఉద్దేశాల గురించి నమ్మించటానికా?