పుట:Mana-Jeevithalu.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

60

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

మన మాదిరిగానే ఉండటంలో ఎందుకు తృప్తి పొందం? మనం ఉన్న స్థితికి మనకే భయం, సిగ్గూ కలుగుతున్నాయా? పేరు, పదవి, ఆస్తి - ఇవన్నీ అంత ప్రధానమైనవా? మనం గుర్తింపబడాలనీ, అభినందింపబడాలనే కోరిక ఎంత ప్రబలమైనదో నమ్మశక్యం కాదు. యుద్ధోన్మాదంలో చేసిన దుష్కృత్యాలకు గౌరవింపబడతారు. తోటిమానవుని చంపినందుకు సాహసవీరుడనిపించు కుంటాడు. హక్కులతోనూ, గడుసుతనంతోనూ, సామార్థ్యంతోనూ కొంత పైకొస్తారు - ఈ పైకి అనేది ఒక స్థిరమైన స్థానానికనికాదు. విజయం కలిగించే మత్తులో ఆ ఎత్తు ఇంకా ఇంకా పైకి పెరుగుతుంది. దేశమైనా, వ్యాపారమైనా అంతా మీరే. మీ మీదే సమస్యలన్నీ ఆధారపడి ఉంటాయి. మీరే అధికారం. మత సంస్థలో పదవి, ప్రతిష్ఠ, గౌరవం లభిస్తాయి. అందులో కూడా మీరు ఒక ప్రత్యేకమైన వారు. అందరిలోకి ప్రముఖులు. లేకపోతే, ఒక గురువుకి శిష్యుడైపోతారు మీరు. వారు చేసే పనిలో సహకరిస్తారు. మీరూ ప్రముఖులవుతారు - వారికి ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి, వారి బాధ్యతను పంచుకుంటారు కాబట్టి మీరు ఇచ్చేదాన్ని ఇతరులు స్వీకరిస్తున్నారు కాబట్టి. వారి పేరుతోనే అయినా, మీరే సాధనం. మీరు గోచీ పెట్టుకోవచ్చు, కాషాయ వస్త్రాలు ధరించవచ్చు, కానీ, ఆ చేష్టలు చేసేది "మీరు" - అన్నిటినీ త్యజిస్తున్న "మీరు"

ఏదో ఒక విధంగా, పైకి తెలియకుండా అయితేనేం, బాహాటంగా తెలిసేటట్లయితేనేం, అహాన్ని పెంచిపోషిస్తూ ఉంటారు. సమాజానికి ప్రతికూలమైన, హానికరమైన కార్యకలాపాలతో అహం తన్ను తాను పోషించుకోవలసిన అవసరం ఏమిటి? మనం కష్టాల్లోనూ, దుఃఖాల్లోనూ అంతరంగిక సుఖాలకోసం, ఆఖరుకి వాటి వల్ల బాధ, దుఃఖం తప్పవని తెలిసికూడా ఎందుకు అర్రులు చాస్తుంది? ఈ కష్టపడటమే మనం జీవించటమనీ, మన జీవితానికొక ధ్యేయం ఉన్నదనీ, క్రమంగా మన సంఘర్షణకీ, దుఃఖానికీ కారణభూతమైన వాటిని త్రోసి పారవెయ్యగలుగుతామనీ అనుకునేట్లు చేస్తుంది. మన కార్యకలాపాలన్నీ ఆగిపోతే మనం ఏమీకాము అనీ, మనం తప్పిపోతామనీ, జీవితానికి అర్థం ఉండదనీ అనుకుంటాం. అందుకని అదే సంఘర్షణలో, సందిగ్ధతలో, ప్రతికూలతలో