పుట:Mana-Jeevithalu.pdf/65

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


21. వ్యక్తి, సమాజం

రద్దీగా ఉన్న వీధిలో నడుస్తూ వెడుతున్నాం. వీధి కిటువైపూ అటువైపూ దారి జనంతో నిండి ఉంది. కారులూ, బస్సులూ, వదుల్తున్న పొగ వాసనతో మా ముక్కులు నిండి పోయాయి. దుకాణాల్లో ఎన్నో ఖరీదైన వస్తువులూ, చవకబారు వస్తువులూ ప్రదర్శింపబడి ఉన్నాయి. ఆకాశం వెలవెలబోతున్న వెండి రంగులో ఉంది. ఆ రహదారి చప్పుళ్లలోంచి బయటపడి పార్కులోకి వచ్చేసరికి హాయిగా ఉంది. పార్కులో బాగా లోపలిదాకా వెళ్లి కూర్చున్నాం.

ప్రభుత్వం సైనికీకరణంతోనూ శాసనాలతోనూ, ప్రతిదాంట్లోనూ వ్యక్తిని తనలో లీనం చేసుకుంటోంది అంటున్నాడాయన. దైవాన్ని బదులు ప్రభుత్వాన్ని ఆరాధించటం జరుగుతోందిప్పుడు. చాలవరకు అన్ని దేశాల్లోనూ ప్రభుత్వం ప్రజల అంతరంగిక జీవితాల్లోకి కూడా ప్రవేశిస్తోంది. వాళ్లు ఏం చదవాలో, ఏం ఆలోచించాలో కూడా ఆదేశింపబడుతున్నారు. ప్రభుత్వం తన ప్రజలపైన ఒక కన్ను వేసి ఉంచుతోంది. తన దివ్య నేత్రాన్ని వారిపై ప్రసరింప జేస్తోంది - మత సంస్థ చేసే దానికి బదులుగా. ఇదొక కొత్తమతం. మనిషి ఇదివరకు చర్చికి దాసుడుగా ఉండేవాడు. ఇప్పుడు ప్రభుత్వానికి దాసుడు. ఇంతకుముందు చర్చి, ఇప్పుడు ప్రభుత్వం అదుపులోనూ ఉందతని చదువు. మనిషి విమోచన గురించి అ రెండూ పట్టించుకోవు.

వ్యక్తికీ, సమాజానికీ మధ్య ఎలాంటి సంబంధం ఉంది? సమాజం వ్యక్తికోసం ఉన్నది గాని వ్యక్తి సమాజంకోసం కాదు నిశ్చయంగా. సమాజం ఉన్నది వ్యక్తికి లాభదాయకంగా ఉండటం కోసం. అది ఉన్నది వ్యక్తికి స్వాతంత్ర్యాన్ని ఇవ్వటం కోసం, తనలోని అత్యున్నతమైన వివేకాన్ని మేలుకొలుపుకునే అవకాశాన్ని వ్యక్తికి కలుగజేయటం కోసం. ఈ వివేకం సాంకేతిక నైపుణ్యాన్నీ, జ్ఞానాన్నీ అలవరచుకోవటం కాదు. ఇది పైపై మనస్సుతో సంబంధం లేని సృజనాత్మక సత్యాన్ని తెలుసుకుంటూ ఉండటం. వివేకం సాధన చేసి పొందే ఫలితం కాదు; క్రమక్రమంగా పెరిగే ఘనతనుంచీ, విజయం నుంచీ పొందే స్వేచ్ఛ. వివేకం స్థిరంగా ఉండేది కాదు. దాన్ని అనుకరించటం, సూత్రబద్ధం చేయటం సాధ్యం కాదు. అందుచేత దాన్ని