పుట:Mana-Jeevithalu.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

52

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

ఉందా అని ఎందుకు అడుగుతాం? మన దగ్గరొక నమూనా ఉంది. అ సత్యాన్ని కనుక్కున్నామనుకునే వారి ఉదాహరణ ఉంది. ఉదాహరణ మనకన్న ఉన్నతస్థితిలో ఉండి మనలో ఒక విధమైన సందిగ్ధతని కలిగిస్తుంది. ఆ విధంగా ఉదాహరణకి ప్రాముఖ్యం హెచ్చిపోతుంది. ఇక ఉదాహరణకీ మనకీ మధ్య పోటీ వస్తుంది. మనం కూడా అదే విధంగా ఎవ్వరూ చెయ్యలేనిపని చేసి నిరూపించాలని ఉంటుంది. చైతన్యావస్థలో గాని, సుప్తచైతన్యస్థితిలో గాని, ఇప్పుడున్న దానిని ఉదాహరణలో మాదిరిగా ఉండే దానితో పోల్చి చూడటం వల్ల కదా "నాకా శక్తి ఉందా?" అనే ప్రశ్న వచ్చింది?

ఒక ఆదర్శంతో మనల్ని మనం ఎందుకు పోల్చుకోవటం ? ఈ పోల్చుకోవటం వల్ల అవగాహన కలుగుతుందా? అసలా ఆదర్శానికీ మనకీ తేడా ఉందా? ఇది మనం స్వయంగా కల్పించుకున్నదే కాదా? మనం తయారుచేసుకున్నది కాదా? మనం ఉన్న స్థితిని యథాతథంగా అర్థం చేసుకోకుండా అది అడ్డు నిలవటం లేదా? అలా పోల్చి చూడటం మనల్ని మనం అవగాహన చేసుకోకుండా తప్పించుకోవటం కాదా? మన నుంచి మనం తప్పించుకోవటానికి అనేక మార్గాలున్నాయి. అందులో పోల్చుకోవటం ఒకటి. నిజానికి ఎవరిని వారు అర్థం చేసుకొనకుండా సత్యాన్ని శోధించాలను కోవటం మన నుంచి మనం పారిపోవటమే. ఆత్మజ్ఞానం లేకుండా మీరు శోధించే దైవం కేవలం మీ భ్రమ మాత్రమే అవుతుంది. భ్రమ సంఘర్షణకీ, దుఃఖానికీ దారి తీయక తప్పదు. ఆత్మజ్ఞానం లేకుండా సరిగ్గా ఆలోచించటం కూడా సాధ్యం కాదు. అప్పుడు ఉన్న విజ్ఞానమంతా అజ్ఞానమే అయి, గందరగోళానికీ, వినాశానికీ దారి తీస్తుంది. ఆత్మజ్ఞానం అంతిమ లక్ష్యం కాదు. అనంతమైన దాన్ని తెరిచి చూపే ద్వారం మాత్రమే.

"ఆత్మ జ్ఞానం సంపాదించటం చాలా కష్టం కాదా? దానికి ఎంతో కాలం పట్టదా?"

అసలు స్వీయజ్ఞానం సంపాదించటం కష్టం అనే భావమే ఆత్మజ్ఞానానికి అవరోధం. నా సలహా ఏమిటంటే, అసలది కష్టమనీ, చాలా కాలం పడుతుందనీ అనుకోకండి. అదేమిటో, ఏంకాదో, ముందుగానే నిశ్చయానికి