పుట:Mana-Jeevithalu.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

50

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

విషయంలో అసంతృప్తిగా ఉన్నాడు. కానీ, సంసారం కోసం గడుపు కొస్తున్నాడుట. ఆయన వివాహం సుఖంగా సాగుతున్నట్లే అనుకోవచ్చు. తన పిల్లలిద్దరి మీదా ఆయనకి ప్రేమ. ఆ దూరదేశంలో కాలేజిలో చదువు కుంటున్నారిప్పుడు. వారికి ఉజ్జ్వలమైన భవిష్యత్తు ఉందిట. కాని ఆయనకి జీవితంలోనూ, కార్య నిర్వహణలోనూ అసంతృప్తి అంతకంతకు ఎక్కువవుతోందిట. ఇంక భరించలేని స్థితికి వచ్చిందిట. సంసారాన్ని వదిలేసి, భార్యకీ, పిల్లలకీ అవసరమైన ఏర్పాట్లన్నీ చేసి ఇక్కడికి వచ్చాడిప్పుడు. ఎలాగోలాగ గడుపుకోవటానికి తగినంత డబ్బుంది చేతిలో. దైవాన్ని అన్వేషించటానికి వచ్చాడుట. తను మతి స్తిమితంలేని వాణ్ణి కాదన్నాడు. తన లక్ష్యం ఏమిటో తనకు స్పష్టంగా తెలుసునన్నాడు.

ఈ స్థిరత్వం అనేది విజయం సాధించినవాళ్లు గాని, సాధించలేక నిరుత్సాహంతో బాధపడుతున్న వాళ్లుగాని నిర్ణయించి తీర్పు చెప్పవలసిన విషయం కాదు. విజయం సాధించిన వాళ్లు కూడా మతి స్థిరంగా లేని వాళ్లు కావచ్చు. సాధించలేక నిరుత్సాహపడిన వాళ్లు కూడా దుస్సహంగా ద్వేషపూరితంగా తయారవచ్చు, లేదా, ఏదో స్వయం కల్పితమైన భ్రమలో పడి తద్వారా విమోచన మార్గాన్ని చూసుకోవచ్చు. స్థిరత్వం అనేది విశ్లేషణ కర్తలు పరీక్షించి తేల్చి చెప్పేది కాదు. ఏదో ఒక సూత్రంలో ఇమిడినంత మాత్రాన అది స్థిరత్వం అని సూచనకాదు. అసలా సూత్రమే అస్థిరమైన సంస్కృతి వల్ల పుట్టినది కావచ్చు. కూడ బెట్టాలనే తత్వం గల సమాజం - దాని పద్ధతులూ, సూత్రాలూ అన్ని అస్థిరమైనవే. అవి వామపక్షానివైనా, దక్షిణ పక్షానివైనా, అ కూడబెట్టే అధికారం ప్రభుత్వానికి ఉన్నా, ప్రజలకి ఉన్నా ఒకటే. స్థిరత్వం అంటే కూడబెట్టక పోవటం. స్థిరత్వం, అస్థిరత్వం అనేవి రెండూ ఆలోచనా రంగానికి చెందినవే. అందుచేత దానికదే న్యాయ నిర్ణేత కాలేదు. ఆలోచన అనేదే పరిమిత ప్రతిక్రియ కాబట్టి, నిర్ణీత సూత్రాలకీ, న్యాయసూత్రాలకీ కట్టు బడినది కాబట్టి ఆది సత్యం కాదు. సత్యం ఒక భావం కాదు, ఒక నిశ్చితాభిప్రాయం కాదు.

'దైవం' అన్వేషిస్తే దొరికేదా? తెలుసుకోవటం సాధ్యం కాని దాన్ని ఎలా వెతుకుతారు? వెతకటానికి ముందు ఏం వెతకాలో తెలిసి ఉండాలి కదా.