పుట:Mana-Jeevithalu.pdf/53

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
44
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

చలనం లేకుండా, శాశ్వతంగా కొనసాగేట్లు ఉండాలనుకున్నా, సంబంధం అనేది ఒక సంచలనం, ఒక ప్రక్రియ. దాన్ని గాఢంగా, సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి, ఏదో అంతరంగికమైన పద్ధతిలో, బాహ్య పద్ధతిలో అనుగుణంగా ఉండటంతోకాదు. ఉన్న పద్ధతి ప్రకారం నడుచుకోవటం సంఘంలోని కట్టుబాటు. ప్రేమకి ఆ కట్టుబాటుతో పని లేదు. సంబంధ బాంధవ్యంలో ప్రేమ పవిత్రం చేసే ప్రక్రియ. స్వార్ధపరమైన మార్గాలన్నిటినీ తేటతెల్లం చేసే ప్రక్రియ అది. ఆ విధమైన ఆవిష్కరణ జరగకుండా సంబంధ బాంధవ్యాలకి అర్థంలేదు.

కాని, అలా ఆవిష్కారం కాకుండా ఎంత పోరాడుతాం! ఈ పోరాటం అనేక రూపాల్లో ఉంటుంది - అధికారం చెలాయించటం గాని, అణగి ఉండటంగాని, భయంగాని, ఆశగాని, అసూయగాని, అనుగ్రహంగాని - ఇలా అనేక రకాలుగా. వచ్చిన చిక్కేమంటే మనం ప్రేమించలేం. ఒకవేళ ప్రేమ చూపించినా, అది మనం చెప్పిన పద్ధతి ప్రకారం నడవాలనుకుంటాం. దానికి స్వేచ్ఛనివ్వం. మనస్సులతో ప్రేమిస్తాం కాని హృదయాలతో కాదు. మనస్సు తన్ను తాను కావలసినట్లు మార్చుకోగలదు. కాని, ప్రేమ అలాకాదు. మనస్సు తన్ను తాను సురక్షితంగా ఉంచుకోగలదు. కాని, ప్రేమ అలా చేయలేదు. మనస్సు వెనక్కి లాక్కోగలదు. విడిగా, ప్రత్యేకంగా ఉండగలదు. ఆత్మీయంగా గాని, అంటీ ముట్టనట్లుగా గాని ఉండగలదు. ప్రేమను పోల్చి చూడటం, దాని చుట్టూ కంచె కట్టటం కుదరదు. అయితే, మనకొచ్చే కష్టమంతా మనం "ప్రేమ" అని అనే దాంట్లో ఉంది. నిజానికి, మనం అనేది మనస్సుకి చెందినదే. మన హృదయాలను మానసికమైన వాటితో నింపి, హృదయాలను శూన్యంగా, దేనికోసమో నిరీక్షిస్తున్నట్లుగా ఉంచుతాం. ప్రాకులాడేదీ, ఈర్ష్యపడేది, పదిలపరిచేది, నాశనం చేసేదీ, అన్నీ మనస్సే. మన జీవితాన్ని ఆధీనంలో ఉంచేవి శరీరమూ మనస్సునూ. మనం ప్రేమించటంతో ఊరుకోము. మనం కూడా ప్రేమింపబడాలని ప్రాకులాడుతాం. మనం ఇచ్చేది తీసుకోవటం కోసమే. ఈ ఇవ్వటం మానసికంగానే కాని హృదయ పూర్వకంగా కాదు. మనస్సు ఎప్పుడూ నిశ్చితంగా, సురక్షితంగా ఉండాలని కోరుకుంటుంది. మనస్సుతో ప్రేమని నిశ్చితం చేయటం సాధ్యమేనా?