పుట:Mana-Jeevithalu.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హృదయ నిరాడంబరత

35

సద్గుణం అంటే ఉన్నస్థితిని అప్రయత్నంగా తెలుసుకోవటమూ, అవగాహన చేసుకోవటమూ. మనస్సు అవగాహన చేసుకోలేదు. అవగాహన అయిన దాన్ని ఆచరణలోకి అనువదించవచ్చు, అంతేగాని, అవగాహన మాత్రం చేసుకోలేదు. అర్ధం చేసుకోవటానికి గుర్తించే, గ్రహించే ఆర్ద్రత అవసరం. మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు అటువంటి ఆర్ద్రతని హృదయం మాత్రమే అందివ్వ గలుగుతుంది. కాని మానసిక ప్రశాంతత నైపుణ్యంతో, పరిశ్రమతో వచ్చేది కాదు. ప్రశాంతత కావాలనే కోరికే దాన్ని సాధించటానికి ఒక శాపం; దానితో అనంతమైన సంఘర్షణలూ, బాధలూ; ప్రతికూలంగాగాని, అనుకూలంగా గాని ఏదో అవాలని తాపత్రయ పడటం అంటే హృదయంలోకి సద్గుణాన్ని చేరనివ్వకపోవటమే. సద్గుణం సంఘర్షణ కాదు. సాధించవలసిన ఘనత కాదు, సాధన కొనసాగించటం కాదు, ఫలితం పొందడం కాదు. స్వయం సంకల్పిత వాంఛలేని స్థితి అది. మరొక స్థితికోసం ప్రయాసపడుతూ ఉంటే మనం సహజ స్థితిలో లేనట్లే. మరేదో అవాలని కష్టపడుతున్నప్పుడు ఉన్న స్థితిలో లేనట్లే. మరొక స్థితికోసం పడే కష్టంలో ప్రతిఘటన, ఇంద్రియ సంయమనం, శరీర శోషణ, సన్యసించడం ఉంటాయి. వీటిని అధిగమించటం కూడా సద్గుణం కాదు. ఏదో అవాలనే తాపత్రయం లేకుండా స్వేచ్ఛగా ఉన్నప్పుడు ఉండే ప్రశాంతతే సద్గుణం. ఈ ప్రశాంతత హృదయంలో ఏర్పడినది, మనస్సులోనిది కాదు. సాధన చేసి, పట్టుదల పట్టి, ప్రతిఘటించి మనస్సుని ప్రశాంతంగా చెయ్యవచ్చు. కాని, అటువంటి శిక్షణ హృదయం యొక్క సద్గుణాన్ని నాశనం చేస్తుంది. సద్గుణం లేకపోతే శాంతి ఉండదు. ఆనందం ఉండదు. హృదయం యొక్క సద్గుణమే అవగాహన.

14. హృదయ నిరాడంబరత

ఆకాశం తెరిపిగా నిండుగా ఉంది. విశాలంగా రెక్కలు తెరుచుకుని ఒక లోయ మీంచి మరొక లోయ మీదికి సునాయసంగా ఎగిరివెళ్లే పెద్ద పక్షులు లేవు ఎక్కడా ఒక్క మేఘం కూడా కదలటం లేదు. చెట్లు నిశ్చలంగా ఉన్నాయి. నీడలో కొండల మలుపులన్నీ తెలుస్తున్నాయి. ఆత్రుతగా ఉన్న