పుట:Mana-Jeevithalu.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

34

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

వదులుకోవటమే. భయం ఉంటే సద్గుణం ఎలా ఉంటుంది? భయం ఎప్పుడూ మనస్సులో ఉంటుంది. హృదయంలో కాదు. భయం అనేక రూపాల్లో - సద్గుణం, మాన్యత, సర్దుకుపోవటం, సేవ మొదలైన వాటిలో దాక్కుంటుంది. మానసిక సంబంధాల్లోనూ, మానసిక కార్యకలాపాల్లోనూ భయం ఎప్పుడూ ఉంటుంది. మనస్సూ, దాని చర్యలూ వేరువేరు కావు. కాని అదే వేరు చేస్తుంది - తను కొనసాగుతూ ఉండటానికీ, స్థిరత్వం పొందటానికీ. కుర్రవాడు పియానో మీద సాధన చేసినట్లు మనస్సు కూడా నైపుణ్యంతో సద్గుణాన్ని సాధన చేస్తుంది - తన్ను తాను సుస్థిరం చేసుకోవాటానికీ, జీవితాన్ని ఎదుర్కోవటంలో ఆధిక్యం పొందటానికీ, లేదా, తాను మహోన్నత మనుకుంటున్న దాన్ని సాధించటానికీ. జీవితాన్ని ఎదుర్కోవటానికి సంసిద్ధత ఉండాలి. అంతేగాని, తన చుట్టూ తాను గీత గీసుకున్నట్లు సద్గుణమనే గౌరవప్రదమైన గోడ కట్టుకోవటం కాదు కావలసినది. మహోన్నతమైన దాన్ని ప్రయత్నించి సాధించలేము. దానికి మార్గంలేదు. లెక్క ప్రకారం క్రమంగా అభివృద్ధి చెందటమంటూ లేదు. సత్యం దానంతట అదే రావాలి. మీరు దాని దగ్గరకు పోలేరు. మీరు అలవరచుకుంటున్న సద్గుణం మిమ్మల్ని అక్కడికి చేర్చలేదు. మీరు సాధించేది సత్యంకాదు. కేవలం మీ స్వయం సంకల్పిత వాంఛ మాత్రమే. ఒక్క సత్యంలోనే ఆనందం ఉంటుంది.

తను సుస్థిరంగా ఉండాలని, మనస్సు గడుసుగా సర్దుకుపోవటంలోనే భయాన్ని పోషిస్తూ ఉంటుంది. ఈ భయాన్నే పూర్తిగా అవగాహన చేసుకోవాలి గాని, సద్గుణంతో ఉండటం ఎలాగా అని కాదు. అల్పమనస్సు సద్గుణాన్ని అవలంబించినా దాని అల్పత్వం పోదు. దాని అల్పత్వాన్ని తప్పించుకోవటానికి చేసే ప్రయత్నమే అవుతుంది సద్గుణం. అటువంటి సద్గుణం కూడా అల్పమైనదే అవుతుంది. ఈ అల్పత్వాన్ని అర్ధం చేసుకోనట్లయితే సత్యాన్ని అనుభవం పొందటం ఎలా సాధ్యమవుతుంది? అల్పమైన మనస్సు సద్గుణాలు అవలంబించినా పరిమితులు లేని దానిని ఎలా ఆహ్వానించ కలుగుతుంది?

మానసిక ప్రవృత్తిని, అంటే, తనని తాను అర్ధం చేసుకోవటంలోనే సద్గుణం కలుగుతుంది. సద్గుణం అంటే కూడబెట్టిన నిరోధక శక్తి కాదు.