పుట:Mana-Jeevithalu.pdf/35

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
26
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

తన పిల్లలకు ఎటువంటి చదువు చెప్పించాడో - అదంతా. తాను ధారాళంగా దానాలు చెయ్యకపోయినా, కొద్దోగొప్పో ఇక్కడా అక్కడా ఇచ్చాడుట. ప్రతివాడూ ఈ ప్రపంచంలో ఒక విశిష్టస్థానాన్ని సంపాదించుకునేందుకు కష్టపడాలని ఆయన దృఢాభిప్రాయం.

మాన్యత అనేది ఒక శాపం. మనస్సునీ, హృదయాన్నీ హరించి వేయగలిగేటంత 'చెడ్డది'. మనకు తెలియకుండానే మనలో దూరి మన ప్రేమను ద్వంసం చేస్తుంది. మాన్యత పొందటం అంటే విజయం సాధించినట్లు భావించటం, ప్రపంచంలో తన కొక స్థానాన్ని ఏర్పరచుకోవటం, తన చుట్టూ సుస్థిరత అనే గోడ కట్టుకోవటం, ధనం, అధికారం, విజయం, సామర్థ్యం, సద్గుణం - వీటన్నిటి మూలంగా వచ్చే ఒక విధమైన ధీమాతో ఉండటం. ఈ ధీమాతో వచ్చే ప్రత్యేకత మూలంగా, సమాజం అనే మానవ సంబంధం పట్ల ద్వేషం, విరోధం బయలుదేరుతాయి. మాన్యత పొందిన వారు ఎప్పుడూ సమాజంలో ముఖ్యులు. సంఘర్షణకీ దుఃఖానికీ వారే ఎప్పుడూ కారకులవుతారు. ద్వేషింపబడేవారిలాగే మాన్యత పొందినవారు కూడా పరిస్థితులకు బానిసలే. తమ చుట్టూ ఉన్న పరిసరాలు పరంపరగా వస్తున్నవి. వాటి ప్రభావాలు వారికెంతో ముఖ్యం. ఇవే వారిలోని లేమిని దాచి ఉంచుతాయి. మాన్యత పొందిన వారెప్పుడూ తమ్ము తాము రక్షించుకుంటూ భయంతోనూ, అనుమానంతోనూ ఉంటారు. వారి హృదయాల్లో ఎప్పుడూ భయమే. అందుచేత ఆగ్రహమే వారి సుగుణం. వారికి రక్షణ నిచ్చేవి వారి సద్గుణమూ, భక్తీ. వారు లోపల శూన్యంగా ఉండి, కొట్టగానే పెద్ద చప్పుడు చేసే మద్దెలవంటివారు. మాన్యత పొందినవారు సత్యాన్ని ఎప్పటికీ ఎదుర్కోలేరు. ద్వేషింపబడేవారి లాగే, వీరు కూడా తమ అభివృద్ధి కోసం పడే తాపత్రయంలోనే మునిగి ఉంటారు. వారు సత్యాన్ని తప్పించుకుంటున్నందువల్ల ఆనందం అనేది లభ్యంకాదు వారికి.

దురాశ లేకుండా ఉండటానికీ, ఔదార్యం లేకుండా ఉండటానికీ దగ్గర సంబంధం ఉంది. రెండూ స్వార్ధాన్ని కప్పిపుచ్చే పద్ధతులే - అవి స్వార్ధ పరాయణతకు మరో అదృశ్య రూపం. దురాశ ఉంటే చురుకుగా ఉండాలి, నలుగురితో తిరగాలి, శ్రమించాలి, పోటీ చెయ్యాలి, బలంగా ముందుకు తోసుకుపోవాలి. ఈ పట్టుదల లేకుండా ఉంటే మీకు దురాశలేనట్లు కాదు;