పుట:Mana-Jeevithalu.pdf/333

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
324
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

సమాధానాన్ని ఇంకొకరి నుంచి ఆశించేందుకు బదులు మనిద్దరం కలిసే కనుక్కుందాం. దాన్ని మీరే పరిశీలించి కనుకున్నట్లయితే అది మీరు అనుభవం పొందినట్లవుతుంది. అప్పుడది నిజమైనదవుతుంది, కేవలం నిశ్చయమో, నిర్ణయమో, మాటల్లో చెప్పిన సమాధానమో కాదు.

"అయితే నా సమస్య ఏమిటి?"

ఈ విధంగా అనలేమా? ప్రశ్నకి తక్షణం అనాలోచితంగా మీ మొట్టమొదటి ప్రతిక్రియ ఏమిటి? పని ముందొస్తుందా? అది కాకపోతే మరేది?

"మీరేం చెప్పబోతున్నారో గ్రహించటం మొదలు పెట్టాను. నా మొట్టమొదటి స్పందన విభ్రాంతి చెందటం. ఇన్ని సంవత్సరాలుగా నేను చేసే పని ఎలా చేస్తున్నానో గ్రహించి నిర్ఘాంతపోయాను. మీరన్నట్లు ఉన్నదాన్ని ఎదురుగా చూడటం ఇదే మొదటిసారి. అది చాలా సంతోషకరంగా లేదని మాత్రం గట్టిగా చెప్పగలను. ఇంకా ముందుకు పోగలిగితే బహుశా ఏది ముఖ్యమో గ్రహించగలుగుతానేమో. అప్పుడు సహజంగా తరవాత పని జరుగుతుంది. కాని పని ముఖ్యమా, ఇంకోటేదైనా ముఖ్యమా అన్నది మాత్రం నాకింకా స్పష్టం కావటం లేదు."

ఎందుకు స్పష్టం కావటం లేదు? స్పష్టం కావటానికి సహాయం కావాలా, లేక గ్రహించటానికి ఇష్టపడటం కావాలా? గ్రహించకుండా ఉండాలనే కోరిక క్రమంగా కొంతకాలానికి మాయమై పోతుందా? మీకు స్పష్టం కాకపోవటానికి కారణం మీరు యథార్ధాన్ని గ్రహించటానికి ఇష్టపడటం లేదన్నది ప్రాథమిక సత్యం కాదా? స్పష్టం కావటం మీకు ఎందుకు ఇష్టం లేదంటే, అది మీ దైనందిన జీవనవిధానాన్నే తలక్రిందులు చేస్తుందని. మీరు ఇచ్ఛా పూర్వకంగానే ముందుకి నెట్టుతున్నారని తెలుసుకుంటే మీకు వెంటనే స్పష్టం అవదూ? ఇలా తప్పించుకోవటం వల్లనే గందరగోళం ఏర్పడుతుంది.

"ఇప్పుడంతా స్పష్టమవుతోంది నాకు. నేనేం చెయ్యాలన్నది అప్రస్తుతం. బహుశా నేను చేసే పనినే ఇంకా చెయ్యవచ్చు. కాని పూర్తిగా వేరే దృష్టితో చూద్దాం."

* * *