పుట:Mana-Jeevithalu.pdf/332

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పని

323

ఎంతో సమర్థులు, దయాదాక్షిణ్యాలు లేనివారు, మీకు ఆనందాన్నిచ్చే దానికోసం అధికారం చెలాయిస్తారు. అందువల్ల హాని కలిగించటానికీ, శత్రుత్వం పెంపొదించుకోవటానికి, మీకభ్యంతరం లేదు.

"నేను ఆవిధంగా ఇంతకు ముందెప్పుడూ చూడలేదు. కాని, అది పరిపూర్ణ సత్యం. కాని దాని గురించి నేనేం చెయ్యాలి?"

ఇంత సాధారణమైన సత్యాన్ని గ్రహించటానికి మీకు ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టిందో చూడటం కూడా ముఖ్యం కాదా?

"మీరన్నట్లు, నా పని అయే దాకా నేను ఎవరికి హాని కలిగించినా లెక్క చెయ్యలేదు. నిజంగా, సాధారణంగా నేను అనుకున్న ప్రకారం సాధిస్తాను. నేను ఎప్పుడూ సమర్థవంతంగా, సూటిగా ఉంటాను కాబట్టి - దాన్నే మీరు దయాదాక్షిణ్యాలు లేకపోవటం అంటున్నారు. మీరన్నది పూర్తిగ నిజం. కాని ఇప్పుడు నేనేం చెయ్యాలి?"

ఇంత మామూలు సత్యాన్ని గ్రహించటానికి అన్ని సంవత్సరాలు తీసుకున్నారు - మీరింతవరకూ దాన్ని గ్రహించటానికి ఇష్టపడలేదు కనుక. దాన్ని గ్రహించటంలో మీరు ఉన్న పునాదినే ఎదుర్కొంటున్నారు. మీరు ఆనందం కోసం ప్రయత్నించి, పొందారు. కాని దానివల్ల ఎప్పుడూ సంఘర్షణా, వైరుధ్యం కలిగాయి. ఇప్పుడు బహుశా మొదటిసారి మీ గురించిన యథార్ధాలను మీ ఎదురుగా చూస్తున్నారు. మీరేం చెయ్యాలి? పనిచెయ్యటానికి మరో విధానం లేదా? ఆనందంగా ఉండి పనిచెయ్యటానికి వీల్లేదా - పనిలో ఆనందాన్ని వెతుక్కునే బదులు? పనిని గాని, ప్రజల్ని గాని ఒక లక్ష్యానికి సాధనంగా ఉపయోగించుకుంటున్నప్పుడు, నిజానికి మనకి అనుబంధం ఏర్పడదు - పనితో గాని, ప్రజలతో గాని సంపర్కం ఉండదు. అప్పుడు మనకి ప్రేమించటం చేతకాదు. ప్రేమ ఒక లక్ష్యానికి సాధనం కాదు. అదే అనంతమైనది. నేను మిమ్మల్ని ఉపయోగించుకుని, మీరు నన్ను ఉపయోగించుకుని, దాన్ని సంబంధం అంటాం సాధారణంగా. మనం ఒకరికొకరం మరోదానికి సాధనంగా మాత్రమే ముఖ్యమవుతాం. అందుచేత మనం ఒకరికొకరం ముఖ్యం కానేకాదు. ఈ పరస్పరం వినియోగించుకోవటం నుంచే సంఘర్షణా, వైరుధ్యం బయలుదేరుతున్నాయి. అందుచేత మీరు ఏం చెయ్యాలి?