పుట:Mana-Jeevithalu.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

మనం ఉండటం అంతా గతంలోనే. మన ఆలోచనలు గతంమీద ఆధారపడి ఉన్నాయి. గతమే మనకు తెలిసినది. గతం నీడ ప్రస్తుతాన్ని కప్పివేస్తుంది. ప్రస్తుతం తెలియకుండా ఉండిపోతుంది. అపరిచితమైనది భవిష్యత్తు కాదు. ప్రస్తుతమే. అనిశ్చితమైన ప్రస్తుతాన్ని తప్పించుకుని ముందుకు పోతున్న గతమే భవిష్యత్తు అవుతుంది. ఈమధ్య ఏర్పడే ఖాళీలో, విరామంలో జ్ఞానం అప్పుడప్పుడు తన కాంతిని నింపుతూ ఉంటుంది. ప్రస్తుతంలోని శూన్యం ఆవిధంగా నిండుతుంది. కాని ఈ శూన్యంలోనే జీవితం యొక్క అద్భుత శక్తి ఇమిడి ఉంది.

జ్ఞానానికి అలవాటు పడటంకూడా తక్కిన దురలవాట్ల వంటిదే. ఇది శూన్యత, ఒంటరితనం, నిరుత్సాహం, ఏమీ అవకుండా ఉండిపోవటం - వీటి భయం నుంచి తప్పించుకొనే మార్గాల్లో ఒకటి. జ్ఞానం యొక్క కాంతి మనస్సు ఛేదించలేని చీకటిని సున్నితంగా కప్పే పొర వంటిది. మనస్సు అపరిచితమైన దానికి భయపడుతుంది. ఆ భయాన్ని తప్పించుకోవటానికి జ్ఞానం, సిద్ధాంతాలూ, ఆశలూ, ఊహలూ వీటన్నిటిలోనూ తలదాచుకుంటుంది. తెలియని దాన్ని గ్రహించటానికి ఈ జ్ఞానమే ప్రతిబంధకమౌతుంది. జ్ఞానాన్ని త్రోసి పారవెయ్యటం అంటే భయాన్ని కొనితెచ్చుకోవటమే. దేన్నైనా గ్రహించటానికి వీలైన ఏకైక సాధనం మనస్సు. దాన్ని కాదంటే సుఖదుఃఖాలకు లోనుకావలసి వస్తుంది. కాని జ్ఞానాన్ని త్రోసి పారవెయ్యటం సులభం కాదు. అజ్ఞానంతో ఉండటం అంటే జ్ఞానం నుంచి స్వేచ్ఛ పొందటం కాదు. అజ్ఞానం అంటే తన్ను తాను తెలుసుకోలేక పోవటమే. తమ స్వార్ధచింతనను అర్ధం చేసుకోనట్లయితే జ్ఞానం అజ్ఞానమే అవుతుంది. తన్ను తాను అర్ధ చేసుకోవటమే జ్ఞానం నుంచి స్వేచ్ఛ లభించటం.

పోగు చేసుకోవటం, కూడబెట్టాలనుకోవటం - వీటి అర్ధం తెలిసినప్పుడే జ్ఞానం నుంచి స్వేచ్ఛ లభిస్తుంది. కూడబెట్టి దాచుకోవాలనే కోరికకు మూలం సురక్షితంగా సుస్థిరంగా ఉండాలనే కాంక్ష. ఇది చెడ్డదనీ, ఇది సరియైనదనీ అంటూ ఏదో ఒక దానితో తన్ను ఐక్యం చేసుకోవటం, తద్వారా సుస్థిరతని కోరటం, భయంమూలాన్నే. ఈ భయమే దేన్నీ తెలుసుకోనీయకుండా చేస్తుంది. అన్నీ తెలిసినప్పుడు కూడబెట్టవలసిన అవసరమే ఉండదు.