పుట:Mana-Jeevithalu.pdf/323

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
314
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

అంత ముఖ్యం. ఉన్నస్థితి ఎప్పుడూ ఎంతో మామూలుగా ఉంటుంది. కాని, మనమే గందరగోళంగా ఉంటాం. మామూలుగా ఉన్నదాన్ని గందరగోళం చేసి అందులోపడి దారి తప్పుతాం. ఎక్కువవుతున్న మన గందరగోళం ధ్వనినే మనం వింటాం. వినటానికి మనం స్వేచ్ఛగా ఉండాలి. ఏవిధమైన పరధ్యానం ఉండకూడదని కాదు. ఆలోచించటమే ఒక విధమైన పరధ్యానం. నిశ్శబ్దంగా ఉండేలా స్వేచ్ఛగా ఉండాలి మనం. అప్పుడే స్వేచ్ఛగా వినటానికి సాధ్యం.

అతనింకా చెబుతున్నాడు - నిద్రపడుతూ ఉండగా ఉలిక్కిపడి లేచి కూర్చుంటాడు. వెర్రిభయంతో. అప్పుడు గది రూపురేఖలు మారిపోతాయిట. గోడలు క్రింద పడి ఉంటాయట. పైన ఇంటికప్పు ఉండదుట. నేల మాయమై పోతుందిట. భయపడిపోతూ చెమటలు కక్కుకుంటాడుట. ఇలా ఎన్నో సంవత్సరాల నుంచీ జరుగుతోందిట.

దేనికి భయపడుతున్నారు?

"నాకు తెలియదు. కాని భయంతో మెలుకువొచ్చినప్పుడు మా అక్క దగ్గరికో, మానాన్నగారి దగ్గరికో, మా అమ్మదగ్గరికో వెళ్లేవాడిని. వాళ్లతో కాసేపు మాట్లాడేవాడిని స్తిమితపడటానికి. ఆ తరవాత నిద్రపోయేవాడిని. వాళ్లు అర్థం చేసుకుంటారు. కాని నాకు ఇరవై ఏళ్లుదాటాయి. సిగ్గుగా ఉంటోంది."

భవిష్యత్తు గురించి ఆదుర్దాపడుతున్నారా?

"అవును, ఒక విధంగా. మాకు డబ్బున్నప్పటికీ, భవిష్యత్తు గురించి ఆదుర్దాగానే ఉంది."

ఎందుచేత?

"నాకు వివాహం చేసుకుని నాకాబోయే భార్యని సుఖపెట్టాలని ఉంది."

భవిష్యత్తు గురించి ఆదుర్దాపడటం ఎందుకు? మీరు ఇంకా చిన్నవారు. మీరు పనిచేసి ఆమెకి కావలసినవన్నీ సమకూర్చవచ్చు. అదే వ్యాపకం పెట్టుకోవటం దేనికి? సంఘంలో మీ పరపతి పోతుందని భయపడుతున్నారా?

"కొంతవరకు. మాకు కారుంది. కొంత ఆస్తీ, పరపతీ ఉన్నాయి.