పుట:Mana-Jeevithalu.pdf/321

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

312

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

జాగ్రత్తగా గమనిస్తున్నట్లయితే ఉన్నస్థితిని గ్రహించటం జరుగుతుంది.

"అవును, గ్రహించాను. కాని, ఇది పొగతాగటానికి ఎలా వర్తిస్తుంది?"

ఇద్దరం కలిసి ప్రయత్నిద్దాం కనుక్కోవటానికి - ఈ పొగ తాగటం అనే సమస్యని నిందించటం, పోల్చటం మొదలైనవి చెయ్యకుండా పరిశీలించ గలమేమో. సమస్యని మళ్లీ కొత్తగా పరిశీలించగలమా - గతం నీడ దానిపైన పడకుండా? ఏవిధమైన ప్రతిక్రియా లేకుండా చూడటం అత్యంత కష్టం, కాదా? దాన్ని అనాసక్తంగా తెలుసుకోలేకపోతున్నట్లుగా ఉంది, ఎప్పుడూ గతం నుంచి ఏదో ఒక ప్రతిక్రియ ఉంటోంది. సమస్య కొత్తదన్నట్లుగా గమనించటం మనకెంత అసాధ్యమో చూస్తే ఆసక్తికరంగా ఉంటుంది. మనతో బాటు మన గత ప్రయత్నాలనూ, నిర్ణయాలనూ, ఉద్దేశాలనూ మోసుకువెడతాం. ఈ తెరల్లోంచి తప్ప మనం సమస్యని చూడలేము.

ఏ సమస్య అయినా ఎప్పుడూ పాతది కాదు. కాని దాన్ని మనం పాత సూత్రాలతో సమీపిస్తాం. అదే సమస్య మనకి అవగాహన కాకుండా ప్రతిబంధకమవుతుంది. ఈ ప్రతిక్రియలను అనాసక్తంగా అవలోకించండి. ఊరికే అనాసక్తంగా వాటిని తెలుసుకుని ఉండండి. అవి సమస్యని పరిష్కరించలేవని గ్రహించండి. సమస్య నిజమైనది. అది వాస్తవమైనది. కాని, దాన్ని సమీపించే పద్ధతి తగినట్లు ఉండదు. ఉన్నదానికి తగిన ప్రతిక్రియ లేకపోతే సంఘర్షణ బయలుదేరుతుంది. సంఘర్షణే సమస్య. ఈ మొత్తం ప్రక్రియ అవగాహన అయితే, మీ పొగ తాగటం గురించి మీరు తగిన చర్య తీసుకుంటారని మీరే తెలుసుకుంటారు.

87. భద్రత

చిన్న కాలవ మెల్లిగా ప్రవహిస్తోంది వరిచేల చుట్టూ ఉన్న దారిపక్క నుంచి. కలువపువ్వులు దాన్నిండా ఉన్నాయి. అవి ముదురు ఊదారంగులో, మధ్యన బంగారపు రంగుతో ఉన్నాయి. నీటికిపైన స్పష్టంగా ఉన్నాయి. వాటి సువాసన వాటి దగ్గర వరకే ఉంది. అవి ఎంతో అందంగా ఉన్నాయి. ఆకాశం