పుట:Mana-Jeevithalu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జ్ఞానం

23

పరిశుద్ధమైన జీవితాన్ని గడపదలుచుకున్నట్లూ, ఆక్షణం నుంచి ఇక ఎప్పుడూ పొగత్రాగ దలచుకోలేదనీ చెప్పాడు. అతడు ఏమీ చదువుకోలేదుట. అతడు రిక్షాలాగేవాడు మాత్రమేనట. అతని కళ్లు చురుగ్గా ఉన్నాయి. అతడు చిరునవ్వు నవ్వితే బాగుంది.

ఇంతలో రైలు వచ్చింది. కంపార్టుమెంట్‌లో ఒకాయన తన్ను తాను పరిచయం చేసుకున్నాడు. ఆయన ఒక ప్రసిద్ధ పండితుడు. ఆయనకి చాలా భాషలు వచ్చు. ఆయనకు ఎంతో అనుభవం, జ్ఞానం ఉన్నాయి. స్థితిమంతుడు. ఇంకా వృద్ధిలోకి రావాలనే ఆకాంక్ష ఉన్నవాడు. ధ్యానం చేయటం గురించి మాట్లాడాడు. కాని స్వానుభవంతో చెబుతున్నట్లుగా అనిపించలేదు, ఆయన చెప్పటాన్ని బట్టి. ఆయన దేవుడు పుస్తకాల్లోని దేవుడు. జీవితం పట్ల ఆయనకున్న అభిప్రాయాలు తరతరాలుగా వస్తున్నవీ, సంప్రదాయ బద్ధమైనవీ. ఆయనకు బాల్య వివాహాల్లోనూ, పెద్దలు కుదిర్చిన వివాహాల్లోనూ, కట్టుబాట్ల ప్రకారం నడిచే జీవితంలోనూ నమ్మకం ఉంది. ఆయన కులమూ, వర్గమూ, వివిధ కులాల మేధా సంపత్తిలో ఉండే హెచ్చుతగ్గులూ, అన్నీ పట్టించుకుంటాడు. తనకున్న జ్ఞానానికీ, హోదాకీ ఆయన ఒకవిధంగా పొంగి పోతున్నాడు.

సూర్యాస్తమయం అవుతోంది. రైలు చక్కని పల్లె ప్రదేశంలోంచి పోతోంది. పశువులు ఇళ్ళకు తిరిగి పోతున్నాయి. బంగారు వన్నెలో దుమ్ము రేగుతోంది. ఆకాశంలో నల్లని పెద్ద పెద్ద మబ్బులు. దూరాన్నుంచి పిడుగు పడ్డట్లు చప్పుడు. పచ్చని పొలాలు ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి. మలుపు తిరుగుతున్న ఆ కొండ నడుమ పల్లె చూడముచ్చటగా ఉంది. చీకటి పడుతోంది. నల్లని పెద్ద దుప్పి పొలాల్లో తింటూ తిరుగుతోంది. పక్కనుంచి రైలు అరుస్తూ పోతున్నా కన్నెత్తి అయినా చూడలేదు.

జ్ఞానం అనేది రెండు చీకట్ల మధ్య తళుక్కు మనే మెరుపు. కాని జ్ఞానం ఆ చీకటి పైకిగాని, దానికన్న ముందుకి గాని పోలేదు. సాంకేతిక నైపుణ్యానికి జ్ఞానం అవసరమే, యంత్రంలో బొగ్గు అవసరమైనట్లు. కాని, తెలియని దానిని అది చేరుకోలేదు. తెలియనిది తెలిసిన దానిలో చిక్కుకునేది కాదు. తెలియనిది ఆవిష్కృతం కావటానికి ఉన్న జ్ఞానాన్ని తొలగించుకోవాలి. కాని అది ఎంత కష్టం!