పుట:Mana-Jeevithalu.pdf/314

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనుభూతి, ఆనందం

305

ఒకచోట కూడనట్లుండటమే. మనస్సులో గంభీరంగానే ఉంటాను. మా నాన్నగారూ, మా పెద్దవాళ్లూ అంతా చిత్తశుద్ధికి పేరుపొందినవారే. కాని ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల వల్ల నేను పూర్తిగా గంభీరంగా ఉండాలంటే కుదరనివ్వటం లేదు. దాన్నుంచి బయటకు కొట్టుకొచ్చాను. మళ్లీ దాంట్లోకే వెళ్లాలని ఉంది. ఈ అజ్ఞానాన్ని మరిచిపోవాలనుకుంటున్నాను. నేను బలహీనతతో పరిస్థితుల గురించి సణుగుతూ ఉండొచ్చు. అయినా కానీ, నేను నిజంగా ఆనందంగా ఉండాలని కోరుతున్నాను."

అనుభూతి ఒకటీ, ఆనందం మరొకటీ. అనుభూతి ఎప్పుడూ మరింత అనుభూతిని కోరుతుంది. అంతకంతకు దాని పరిధి విశాలమవుతుంది. సుఖానుభూతులకు అంతంలేదు. వాటి సంఖ్య పెరుగుతూ ఉంటుంది, కాని అవి సఫలం కావటంలోనే అసంతృప్తి ఉంటుందెప్పుడూ. ఇంకా కావాలనే కోరిక ఉంటుందెప్పుడూ. ఇంకా ఎక్కువ కోరటానికి అంతుండదు. అనుభూతీ, అసంతృప్తీ వేరుకాలేనివి. ఎందువల్లనంటే, ఇంకా ఎక్కువ కావాలనే కోరిక వాటిని ఒకచోట బంధించి ఉంచుతుంది. అనుభూతి అంటే ఇంకా ఎక్కువ కావాలని కాని, తక్కువ కావాలని కాని కోరటం. అనుభూతి పరిపూర్ణం కావటంలోనే ఇంకా కావాలనే కోరిక ఉద్భవిస్తుంది. అంటే, ఉన్నదానితో అనునిత్యం అసంతృప్తి పడటమే. ఉన్నదానికీ, ఉండబోయేదానికీ మధ్య సంఘర్షణ ఉంటుంది. అనుభూతి ఎప్పుడూ అసంతృప్తే. అనుభూతికి మత సంబంధమైన దుస్తులు వేయవచ్చు. కాని ఇంకా ఉన్నట్లుగానే ఉంటుందది: మానసికమైనదిగా, సంఘర్షణగా, భయంగా, శారీరకమైన అనుభూతులు ఎప్పుడూ ఇంకా కావాలని గోలపెడతాయి. వాటికి ఆటంకం కలిగినప్పుడు, కోపం, అసూయ, ద్వేషం కలుగుతుంది. ద్వేషంలో ఆనందం ఉంటుంది. ఈర్ష్య తృప్తినిస్తుంది. ఒక అనుభూతికి అడ్డుతగిలితే అది తెచ్చే నిస్పృహవల్ల కలిగే వైరుధ్యంలోనే సంతృప్తి దొరుకుతుంది.

అనుభూతి ఎప్పటికీ ప్రతిక్రియే. అది ఒక ప్రతిక్రియ నుంచి మరొక ప్రతిక్రియకు తిరుగాడుతూ ఉంటుంది. తిరుగాడేది మనస్సు. మనస్సే అనుభూతి. మనస్సు అనుభూతులకి - సంతోషదాయకమైన వాటికీ, అసంతోషకరమైన వాటికీ నిలయం. అనుభవం అంతా ప్రతిక్రియే. మనస్సు అంటే