పుట:Mana-Jeevithalu.pdf/311

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
302
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

ప్రయోగం చేయటం సాధ్యంకాదు. మీకు కావలసినదేదో మీకు తెలిసినప్పుడు దాన్ని అనుసరించటం ప్రయోగం చేయటం కాదు. దుఃఖాన్ని తప్పించుకుందామని మీరనుకుంటే, అంటే దాన్ని నిందిస్తే, అప్పుడు దాని సంపూర్ణ క్రియని మీరు అర్థం చేసుకోరు. దుఃఖాన్ని దాటవెయ్యటానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు ఆలోచించేదల్లా దాన్ని ఎలా తప్పించుకోవాలా అనే. దుఃఖాన్ని అర్థం చేసుకోవాలంటే దాన్ని సమర్థించటానికిగాని తప్పించుకోవటానికి గాని ఏవిధమైన చర్యా కావాలని తీసుకోకూడదు. మనస్సు పూర్తిగా అనాసక్తంగా, నిశ్శబ్దంగా గమనిస్తూ ఉంటే ఏవిధమైన సందేహం లేకుండా దుఃఖం తేటతెల్లం కావటాన్ని అర్థం చేసుకోవచ్చు. మనస్సు ఏదైనా ఆశకి గాని, నిర్ణయానికి గాని, జ్ఞాపకానికి గాని కట్టుపడి ఉంటే దుఃఖం యొక్క గాథని అర్థం చేసుకోలేదు. ఉన్నస్థితి యొక్క త్వరితగతిని అనసరించటానికి మనస్సు స్వేచ్ఛగా ఉండాలి. స్వేచ్ఛ ఆఖరున ఉండవలసినది కాదు, ఆరంభంలోనే ఉండాలి.

"ఈ దుఃఖం అంతటికీ అర్థం ఏమిటి?"

దుఃఖం సంఘర్షణకి - సుఖదుఃఖాల సంఘర్షణకి సూచన కాదా? అజ్ఞానాన్ని తెలియజేసేది కాదా దుఃఖం? అజ్ఞానం అంటే యథార్ధాల గురించి వివరాలు తెలిసి ఉండకపోవటం కాదు. అజ్ఞానం అంటే తనలో మొత్తం ఏం జరుగుతున్నదీ తెలుసుకోకపోవటమే. తన రీతులను అర్థం చేసుకోనంత వరకూ దుఃఖం ఉండి తీరుతుంది. తన పద్ధతులను సంబంధ వ్యవహారాల్లో తీసుకునే చర్యల్లోనే కనుక్కోవాలి.

"కాని నా సంబంధం అంతమైపోతుంది కదా."

సంబంధానికి అంతం ఉండదు. ఒక ప్రత్యేక సంబంధం అంతమై పోవచ్చు. కాని సంబంధం అంతం కాదు. ఉండటమంటేనే సంబంధంతో ఉండటం. ఏదీ ఒంటరిగా ఉండలేదు. ఒక ప్రత్యేక సంబంధం ద్వారా మనల్ని మనం విడిగా ఉంచుకోవటానికి ప్రయత్నించినప్పటికీ, ఆ విడిగా ఉంచుకున్న ప్రతిసారీ దుఃఖం కలగటం అనివార్యం అవుతుంది. దుఃఖమంటే విడిగా ఉంచుకోవటమనే ప్రక్రియే.