పుట:Mana-Jeevithalu.pdf/31

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
22
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

పూజాపునస్కారాలు అలవాటయిపోతాయి. అవసరమనిపిస్తాయి. అవి లేకుండా ఉండలేమనిపిస్తుంది. ఈ అవసరాన్ని ఆధ్యాత్మిక పునరుద్ధరణ అనీ, జీవితాన్ని ఎదుర్కోవటానికి కావలసిన శక్తి అనీ, దినదినం, వారంవారం చేసే ధ్యానం అనీ పలువిధాలుగా పేర్కొంటారు. కాని, ఈ ప్రక్రియని మరింత పరీక్షగా చూస్తే నిజానికి, పూజలూ అవీ ఆత్మజ్ఞానం కలగకుండా గౌరవప్రదంగా బ్రహ్మాండంగా తప్పించుకోవటానికి చేసే వ్యర్ధ ప్రయాసలా కనిపిస్తుంది. తన్ను తాను తెలుసుకోకుండా ఏపని చేసినా అర్ధం ఉండదు.

పదేపదే శ్లోకాలు చదవటం, పదాలూ వాక్యాలూ జపించటంవల్ల మనస్సుని నిద్ర పుచ్చటం జరుగుతుంది, తాత్కాలికంగా కొంత ఉత్తేజకరంగా ఉన్నప్పటికీ. ఈ నిద్రావస్థలో కొన్ని అనుభవానికి వస్తాయి. కాని, అవి స్వయం ప్రేరితమైనవే. ఎంత తృప్తినిచ్చినా, ఈ అనుభవాలు ఊహాజనితమైనవే. దేన్ని పదేపదే జపించినా, ఏ విధంగా సాధన చేసినా సత్యం అనుభవంలోకి రాదు. సత్యం ఒక గమ్యంకాదు. ఒక ఫలితం కాదు, ఒక లక్ష్యం కాదు. దాన్ని ఆహ్వానించలేము. అది మనస్సుకి సంబంధించినది కాదు.

9. జ్ఞానం

మేము రైలుకోసం ఎదురుచూస్తున్నాం. అది రావటం ఆలస్యం అయింది. ప్లాట్‌ఫామ్ చెత్తగానూ, గొడవగానూ ఉంది. గాలి వెగటు పుట్టించేట్టుగా ఉంది. మాలాగే చాలా మంది నిరీక్షిస్తున్నారు. పిల్లలు ఏడుస్తున్నారు. ఒకావిడ పిల్లకి పాలిస్తోంది. సరకులమ్మేవాళ్లు టీ, కాఫీ మొదలైన సరుకుల పేర్లు అరుస్తూ అమ్ముతున్నారు. ఆ ప్రదేశమంతా హడావిడిగా గందరగోళంగా ఉంది. మేము ప్లాట్‌ఫామ్ మీద ఇటూ అటూ నడుస్తున్నాం. మా అడుగుల్ని మేమే చూసుకుంటూ, మా చుట్టూ జరుగుతున్నదంతా గమనిస్తున్నాం. ఒకతను మా దగ్గర కొచ్చి వచ్చీరాని ఇంగ్లీషులో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇంతసేపూ అతడు మిమ్మల్ని గమనిస్తున్నట్లూ, మాతో మాట్లాడాలనే భావాన్ని అణచుకోలేకపోయినట్లూ చెప్పాడు. ఎంతో మనస్ఫూర్తిగా చెప్పాడు - తను ఇక ముందు నుంచీ ఎంతో