పుట:Mana-Jeevithalu.pdf/307

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
298
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

వస్తోంది. తల్లి దగ్గరగా పైకి ఎగరటం, క్రిందికి దూకటం. ఈ చేష్టలన్నిటితో విసుగెత్తాక ఆ చెట్టుమీంచి దిగి మరోటి ఎక్కుతోంది. క్రిందికి దిగుతూనే మధ్యలో వెళ్లి తల్లిని కరుచుకుంటోంది. వీపుమీదకెక్కటం, దాని క్రింద ఊగిసలాడటం చేస్తోంది. దాని ముఖం ఎంతో బుల్లిది. దాని కళ్లు ఆటతో, భయంతో చేసే అల్లరితో నిండి ఉన్నాయి.

కొత్తదన్నా తెలియనిదన్నా ఎంత భయపడతాం మనం! మనకి నిత్యం ఉండే అలవాట్లలో దైనందిన చర్యల్లో, దెబ్బలాటల్లో, ఆదుర్దాలో మూసుకుపోయి ఉంటాం. అదే పాత పద్ధతిలో ఆలోచించాలనుకుంటాం. అదే దారిలో వెళ్లాలనుకుంటాం. అవే ముఖాలు చూస్తాం. అవే ఆందోళనలు పెట్టుకుంటాం. క్రొత్తవారిని కలుసుకోవటానికి ఇష్టపడం. ఒకవేళ కలుసుకున్నా ముభావంగా వ్యాకులపాటుతో ఉంటాం. తెలియని జంతువేదైనా ఎదురైతే ఎంత భయపడతాం! ధైర్యం చేసి బయటికి వచ్చినా అది ఆ గోడలు ఇంకా విస్తృతం చేసుకుని వాటి మధ్యనే. మనకి అంతం అంటూ ఉండదు. ఎప్పుడూ కొనసాగే దాన్నే పోషిస్తూ ఉంటాం. రోజురోజుకీ నిన్నటి భారం మోసుకుపోతూ ఉంటాం. మన జీవితం సుదీర్ఘంగా కొనసాగే చలనం. మన మనస్సులు మందకొడిగా సున్నితత్వం లేకుండా ఉంటాయి.

అతను ఏడుపు ఆపులేకపోయాడు. అది అణుచుకుంటూ నిగ్రహించుకుంటూ ఏడ్చిన ఏడుపుకాదు - ఒళ్లంతా అదిరి పోయేటట్లు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఇంకా చిన్న వాడిలా ఉన్నాడు, ఊహా చిత్రాలు చూసిన కళ్లతో. కొంతసేపటి వరకూ మాట్లాడలేకపోయాడు. చివరికి మాట్లాడగలిగేటప్పటికి అతని గొంతు వణికింది. మళ్లీ పెద్దగా వెక్కుతూ ఏడుపు, సిగ్గుపడకుండా స్వేచ్ఛగా ఏడ్చాడు. అంతలోనే చెప్పాడు.

"నా భార్యపోయిన రోజు తరవాత మళ్లీ ఏడవలేదు నేను. అలా ఎందుకేడ్చానో నాకే తెలియదు. కాని తేలికపడింది. ఇంతకుముందు నా భార్య బ్రతికి ఉన్నప్పుడు తనతో కలిసి ఏడ్చాను. కాని, అప్పుడు నవ్వులాగే ఏడుపు కూడా ప్రక్షాళితం చేసేది. తన మరణం తరవాత ప్రతిదీ మారిపోయింది. నేనిదివరకు చిత్రలేఖనం చేసేవాణ్ణి. కాని, ఇప్పుడు కుంచెలు ముట్టుకోలేక పోతున్నాను. నేను గీసిన వాటికేసి చూడలేక పోతున్నాను. గత