పుట:Mana-Jeevithalu.pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

83. కాలం

ఆయన వార్ధక్య లక్షణాలతో ఉన్నాడు. కాని ఆరోగ్యవంతంగా ఉన్నాడు. పొడుగాటి, నెరిసిన జుట్టుతో, తెల్లని గడ్డంతో. ప్రపంచం లోని అనేక భాగాల్లో విశ్వవిద్యాలయాల్లో వేదాంతం గురించి ఉపన్య సించాడుట. పాండిత్యం ఉన్నవాడు. నెమ్మదస్తుడు. తను ధ్యానం చెయ్యనని చెప్పాడాయన. ఆయన పట్టించుకునేది జ్ఞానం ఒక్కటేనట. వేదాంతం గురించీ, ధార్మిక అనుభవాల గురించీ ఉపన్యాసాలిచ్చినా, ఆయనకు స్వయంగా జరిగిన సంఘటనలేమీ లేవుట. వాటికోసం ఆశపడటం కూడా లేదుట. కాలం గురించి వివరంగా చర్చించటానికి వచ్చాడు.

ఆస్తిపాస్తులున్న మనిషికి స్వేచ్ఛగా ఉండాలంటే ఎంత కష్టం! ధనవంతుడు తనకున్న ధన్నాన్ని అవతలికి త్రోసి వెయ్యటం మహాకష్టం. వేరే ఇంకేవైనానో, మరింత గొప్ప లాలసత్వం కలిగించేవో ఉన్నప్పుడే గాని ధనవంతుడు తన సంపదలిచ్చే సౌఖ్యాన్ని వదులుకోడు. తన ఆకాంక్ష ఫలించే మరొక స్థాయి దొరికితే గాని ఉన్నదాన్ని వదులుకోడు. ధనవంతుడికి ధనమే అధికారం. దాన్ని అతడు చలాయిస్తాడు. పెద్ద పెద్ద మొత్తాలు ఇచ్చివెయ్యవచ్చు. కాని ఇచ్చేవాడు అతడే

జ్ఞానం మరో రకమైన ఆస్తి. జ్ఞానం ఉన్నవాడు దానితో తృప్తి పొందుతాడు. అతడికి అంతకన్న కావలసినది లేదు. అతడికి ఉన్న భావన - అధమం ఈయన అనుకునేది జ్ఞానమే కనుక ప్రపంచంలో అన్ని చోట్లా కొద్దో గొప్పో విస్తరింపగలిగితే అది అన్ని సమస్యల్నీ ఎలాగోలాగ పరిష్కరిస్తుందని. ధనం ఉన్న వానికన్న జ్ఞానం సంపాదించినవానికే మరింత ఎక్కువ కష్టం - తనకున్న వాటిని వదులుకుని స్వేచ్ఛగా ఉండటం. అవగాహన, వివేకం ఉండే స్థానాన్ని జ్ఞానం ఎంత సులభంగా ఆక్రమిస్తుందో చిత్రంగా ఉంటుంది. వేటి గురించైనా మన దగ్గర వివరాలుంటే అవి మనకి అర్థమయాయనుకుంటాం. సమస్యకి కారణం తెలుసుకున్నందువల్లనో, దాని వివరాలు తెలిసినందువల్లనో ఇక ఆ సమస్య ఉండదనుకుంటాం మనం. మన సమస్యకి కారణం కోసం వెతుకుతాం. ఈ వెతకటం వల్లనే వెంటనే అవగాహన కాకుండా మనం