పుట:Mana-Jeevithalu.pdf/301

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
292
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

తేటతెల్లం కావటానికి, దాని కథ పూర్తిగా చెప్పుకోవటానికి మనస్సు సున్నితంగా ఉండి, వెంటనే అర్థం చేసుకోగలిగి ఉండాలి. తప్పించుకునే మార్గాల ద్వారానో, సమస్యతో ఏం చెయ్యాలో తెలుసుకోవటం ద్వారానో, దానికి సహేతుక వివరణో, కారణమో తెలుసుకోవటానికి ప్రయత్నించటం, అంటే మాటల్లో నిర్ణయించటం ద్వారానో, మనస్సుకి మత్తు కలిగేటట్లు చేస్తే అప్పుడు ఆ మనస్సు మందకొడిగా అయి, ఆ సమస్య, అంటే ఉన్నస్థితి విప్పిచెప్పే కథని తక్షణం అర్థం చేసుకోలేదు. దీనిలోని సత్యాన్ని గ్రహించండి. మనస్సు సున్నితంగా ఉన్నప్పుడే అది గ్రహించగలుగుతుంది. ఆ సమస్య గురించి మానసికంగా ఏ విధమైన కార్యకలాపం జరిగినా దానివల్ల మనస్సు మందకొడిగానూ, అర్థం చేసుకోలేనిదిగానూ, అది చెప్పేది వినిపించుకోలేనట్లు గానూ అవుతుంది. మనస్సు సున్నితంగా ఉన్నప్పుడు - సున్నితంగా చేయ బడటం కాదు, అది మరోవిధంగా మందకొడిగా చేయటమే - సున్నితంగా ఉన్నప్పుడు ఉన్నస్థితికి, అంటే శూన్యతకి ఉండే ప్రాధాన్యమే పూర్తిగా వేరు.

మనం మాట్లాడుతున్నంతసేపూ అనుభవం పొందుతూ ఉండండి, మాటల స్థాయిలోనే ఉండిపోకండి.

మనస్సుకీ, ఉన్న స్థితికీ సంబంధం ఏమిటి? ఇంతవరకూ, ఉన్నస్థితికి ఒక పేరుపెట్టి, మాటల్లో పెట్టి, పరిచిత సంకేతంగా చేసింది. ఇలా దానికి పేరు పెట్టటం మూలంగా దానితో ప్రత్యక్ష సంబంధం ఏర్పడకుండా ఆటంకపరిచి మనస్సుని మందకొడిగా, సున్నితత్వం లేకుండా చేసింది. మనస్సూ, ఉన్నస్థితీ - రెండూ వేరువేరు ప్రక్రియలు కాదు. పేరు పెట్టటంతో వేరవుతాయి. ఈ పేరుపెట్టటం ఆగిపోతే ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. మనస్సూ, ఉన్నస్థితీ ఒక్కటే. ఉన్నస్థితి ఇప్పుడు గమనించేవాడే - దానికో మాట లేకుండా - అప్పుడే ఉన్నస్థితి పరివర్తన చెందుతుంది. భయంతోనూ, తదితరమైనవాటితోనూ కూడిన శూన్యం అని పిలవబడేదింక ఉండదు. అప్పుడు మనస్సు - అంటే, అనుభవించే స్థితి మాత్రమే ఉంటుంది. అందులో అనుభవించేదీ, అనుభవింపబడేదీ ఉండవు. అప్పుడు అపరిమితమైన ప్రగాడత ఉంటుంది - కొలిచేది లేదు కనుక. గాఢంగా ఉన్నది నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఈ ప్రశాంతతలో అనంతంగా నీరు పొంగుతుంది. మాటలు వాడటమే మనస్సులోని ఆందోళన. మాట లేకపోతే ఉండేది అపరిమితమైనది.