పుట:Mana-Jeevithalu.pdf/300

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
291
పరధ్యానం


ఒంటరిగా ఉండటం ఏమిటో మనందరికీ తెలుసు. ఉపశమనం లేని, బాధాకరమైన, భయంకరమైన శూన్యం. దాన్నుంచి అవతలికి పారిపోవటం ఎలాగో మనకి తెలుసును. ఎందుకంటే పారిపోయే మార్గాలెన్నింటినో పరిశోధించాం. కొంతమంది ఒక మార్గంలో చిక్కుకుంటారు. తక్కినవాళ్లు ఇంకా మార్గాలకోసం వెతుకుతూనే ఉంటారు. కాని, వారిలో ఎవ్వరూ ఉన్న స్థితిలో తిన్నగా సంపర్కం పెట్టుకోరు. మీకు ఒంటరితనంలో వ్యవహరించటం ఎలాగో తెలుసునంటున్నారు. నిజం చెప్పాలంటే, ఒంటరితనం గురించి చర్య తీసుకోవటమే దాన్ని తప్పించుకోవటం. మీరు నడవటానికి వెడతారు, లేదా, ఒంటరితనం పోయే వరకూ దాంతో కూర్చుంటారు. మీరు ఎప్పుడూ దాంతో ఏదో చేస్తూనే ఉన్నారు. దాని కథని చెప్పుకోనివ్వటం లేదు మీరు. దానిపైన మీరు ఆధిపత్యం వహించాలనుకుంటారు, దాన్ని అధిగమించాలను కుంటారు, దాన్నుంచి పారిపోవాలనుకుంటారు. అందుచేత దానితో మీకున్న సంబంధం అదంటే మీకు గల భయం.

సాఫల్యం పొందటం కూడా ఒక సమస్యేనా మీకు? ఏదో ఒక దానిలో తాను సఫలం కావాలనుకోవటానికి అర్థం ఉన్నస్థితిని తప్పించుకోవటం అని కాదా. నేను అల్పుణ్ణి, - కాని నేను దేశంతోనో, కుటుంబంతోనీ, ఏదో నమ్మకంతోనో నన్ను నేను ఐక్యం చేసుకుంటే నేను సాఫల్యం పొందినట్లూ, సంపూర్ణత పొందినట్లూ అనుభూతి పొందుతాను. ఈ సంపూర్ణతకోసం ప్రయత్నించటమే ఉన్నస్థితి నుంచి పారిపోవటం.

"అవును, అది నిజమే. అది కూడా నా సమస్యే."

మనం ఉన్నస్థితిని అర్థం చేసుకోగలిగితే అప్పుడు ఈ సమస్యలన్నీ అంతమవుతాయి. ఏ సమస్యనైనా మనం సమీపించే పద్ధతి ఏమిటంటే దాన్ని తప్పించుకోవటం. దాన్ని గురించి ఏదో చెయ్యాలనుకుంటాం. ఆ చెయ్యటం మనకి సమస్యతో ప్రత్యక్ష సంపర్కం కలగకుండా ఆటంకం కలిగిస్తుంది. ఈ మార్గం సమస్యని అవగాహన చేసుకోవటానికి అడ్డుపడుతుంది. సమస్యతో ఏం చెయ్యాలా అనేదే మనస్సు వ్యాపకం, అంటే నిజానికి దాన్ని ఎలా తప్పించుకోవాలా అనేది. అందువల్ల సమస్యని అర్థం చేసుకోవటం ఎప్పుడూ జరగదు. అది అలాగే ఉంటుంది. ఎందువల్లనంటే, సమస్య, అంటే ఉన్నస్థితి,