పుట:Mana-Jeevithalu.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరధ్యానం

287

ఆలోచన అంతంకాదు. ఆలోచించేవాడే ఆలోచన. తనమీద తానే ప్రయోగించుకోలేడు. అలా చేసుకుంటే అది ఆత్మవంచనే. అతడే ఆలోచన. అతడూ, ఆలోచనా వేరువేరు కాదు. తాను వేరనుకోవచ్చు. వేరుగా ఉన్నట్లు నటించవచ్చు. అది ఆలోచన యొక్క నైపుణ్యతే - తనకు తాను శాశ్వతత్వాన్ని ఆపాదించుకోవటానికి. ఆలోచన ఆలోచనని అంతం చేసుకోవటానికి ప్రయత్నించటం దాన్ని అది శక్తిమంతం చేసుకోవటమే. మీరు దాన్ని ఏంచేసినా, ఆలోచన దాన్ని అది అంతం చేసుకోలేదు. దీనిలోని సత్యాన్ని గ్రహించినప్పుడే ఆలోచన అంతమవుతుంది. ఉన్నస్థితి యొక్క సత్యాన్ని గ్రహించటంలోనే స్వేచ్ఛ ఉంటుంది. ఆ సత్యాన్ని గ్రహించటమే వివేకం. ఉన్నస్థితి ఎప్పుడూ స్థిరంగా ఉండదు. దాన్ని అనాసక్తంగా జాగ్రత్తగా గమనించటానికి ఏవిధమైన సేకరణా లేకుండా స్వేచ్ఛగా ఉండాలి.

82. పరధ్యానం

అది పొడుగ్గా వెడల్పుగా ఉన్న కాలవ - నదిలోంచి మొదలై నీళ్లులేని ప్రదేశాల్లోకి పోతుంది. కాలవ నదికన్న ఎత్తుమీద ఉంది. అందులోకి పోయే నీటికి ఆనకట్ట ఉంది. సరుకుతో నిండిన పడవలు ఇటూ అటూ పోతున్నాయి. వాటి ముక్కోణపు తెరచాపలు నీలాకాశంముందూ, నల్లటి కొబ్బరిచెట్ల ముందూ కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఆ సాయంకాలం రమణీయంగా, ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఉంది. నీరు చాలా నిశ్చలంగా ఉంది. కొబ్బరి చెట్ల నీడలూ, మామిడి చెట్ల నీడలూ దానిలో గీసినట్లుగా ఎంత స్పష్టంగా కనిపిస్తున్నాయంటే నిజమైనదేదో, ప్రతిబింబమేదో వేరుచేయలేనంత అస్పష్టంగా ఉంది. అస్తమిస్తున్న సూర్యబింబం నీటిలో అన్నీ స్పష్టంగా కనిపించేటట్లు చేస్తోంది. సాయంకాలం వెలుగంతా దాని ముఖంమీద ఉంది. అ ప్రతిబింబాలలో సాయంకాలపు నక్షత్రం కూడా కనిపించటం మొదలైంది. నీరు చలనం లేకుండా ఉంది. అటువెళ్లే గ్రామస్తులు కొందరు, సాధారణంగా గట్టిగా సాగదీస్తూ మాట్లాడుకునేవాళ్లు నిశ్శబ్దంగా ఉన్నారు. ఆకుల గుసగుసలు కూడా ఆగిపోయాయి. మైదానం లోంచి ఒక జంతువు వచ్చింది.