పుట:Mana-Jeevithalu.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

282

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

నమ్రతా కలుగుతాయి. బహుశా మీరు అన్వేషించేది అదే కావచ్చు. కాని దాన్ని వెతకటం, కనుక్కోవటం సాధ్యం కాదు. కావాలని మీరేం చేసినా సరే మీరు కనుక్కోలేరు ఎన్నటికీ. అన్వేషణ అంతా అంతమైనప్పుడు అది ఉంటుంది. మీకు తెలిసిన దాన్ని గురించే, అంటే మరింత తృప్తికోసమే ఎప్పుడూ మీరు వెతకగలరు. అన్వేషించటం, జాగ్రత్తగా గమనించటం వేరువేరు ప్రక్రియలు. ఒకటి బంధిస్తుంది. రెండవదానివల్ల అవగాహన కలుగుతుంది. అన్వేషణకి ఎప్పుడూ ఒక గమ్యం దృష్టిలో ఉంటుంది. కాబట్టి ఎప్పటికీ బంధంలోనే ఉంటుంది. అనాసక్తంగా జాగ్రత్తగా గమనించటం వల్ల క్షణక్షణమూ ఉన్నస్థితి అవగాహన అవుతుంది. ఉన్నస్థితి క్షణక్షణానికీ అంతమవుతుంది. అన్వేషణలో కొనసాగటం జరుగుతుంది. అన్వేషణ వల్ల కొత్తది ఎప్పుడూ దొరకదు. అంతమైనప్పుడే కొత్తది ఉంటుంది. కొత్తది అనంతమైనది. ప్రేమ ఒక్కటే నిత్యనూతనమ్యేది.

81.వివేకం పోగుచేసుకునే జ్ఞానం కాదు.

కుటీరం ఎత్తుగా పర్వతాలపైన ఉంది. అక్కడికి చేరటానికి కారులో బంజరు భూమి దాటి ఎన్నో ఊళ్లమధ్యనుంచీ, చక్కని తోటల్లోంచీ, చిక్కని పొలాల్లోంచీ వెళ్లాలి. నీటి సదుపాయం చేసి కష్టపడి పనిచేసే సాగుచేసిన బంజరులో పెంచిన తోటలు,పొలాలు అవి. అందులో ఒక ఊరు మరీ ఆహ్లాదకరంగా ఉంది. పచ్చని మైదానాలతో, పెద్ద పెద్ద నీడనిచ్చే చెట్లతో;దగ్గరలోనే ఒక నది ఉంది. అది దూరాన ఉన్న పర్వతాల్లోంచి బయలుదేరి బంజరు మధ్యదాకా వస్తుంది. ఈ ఊరుకి అవతల నదీ జలపాతం వైపు నుంచి వెళ్లేదారి మంచుశిఖరాలవరకూ దారితీస్తుంది. ఇక్కడ నేలంతా రాళ్లు, బోడిగా ఎండకు మాడి ఉన్నాయి.నదీ తీరాల పొడుగునా మాత్రం చెట్లున్నాయి. దారిలోపలికీ పైకి మలుపులు తిరుగుతూ పైకంటా పోతోంది, పురాతనమైన సరుగుడు చెట్లతో నిండిన అడవుల మధ్య నుంచి. ఎండ వాసన వేస్తోంది వాటినుంచి. గాలి చల్లంగా, స్వచ్ఛంగా అయింది.త్వరలోనే కుటీరానికి చేరుకున్నాం.

రెండురోజులయాక, మాకు బాగా అలవాటు పడిన తరువాత ఒక