పుట:Mana-Jeevithalu.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంతృప్తి

279

అలవాటు పడ్డాడు తను యుద్ధంలో డాక్టరుగానూ, మనస్తత్వ పరిశీలకుడు గానూ పనిచేశానని చెప్పాడు. తనకు చాతనయినంత సహాయం చేశాడుట. కాని తాను ఇచ్చిన దాంతో తనకు తృప్తి కలగలేదుట. ఇంకా ఎంతో ఇవ్వాలనీ, ఇంకా ఎక్కువగా సహాయపడాలనీ కోరుతున్నాడుట. తను ఇచ్చినది చాలా తక్కువట. అందులో ఏదో లోపం ఉందిట.

చాలాసేపటి వరకూ ఒక్కమాట కూడా మాట్లాడకుండా కూర్చున్నాం - ఆయన తన మనస్తాపం వల్ల కలిగే ఒత్తిడులన్నిటినీ కూడగట్టుకుంటున్నంత సేపూ. నిశ్శబ్దం చిత్రంగా ఉంటుంది. నిశ్శబ్దం ఆలోచనవల్ల రాదు. ఆలోచన దాన్ని రూపొందించదు. నిశ్శబ్దాన్ని ఒకచోట కూడబెట్టటం కుదరదు. ఇచ్ఛా పూర్వకమైన క్రియ ద్వారా అది రాదు. నిశ్శబ్దం గురించిన జ్ఞాపకం నిశ్శబ్దం కాదు. నిశ్చలంగా స్పందించే నిశ్శబ్దం ఉంది గదిలో. సంభాషణ దాన్ని భంగం చేయలేదు. ఆ నిశ్శబ్దంలో సంభాషణకీ అర్థం ఉంది. మాటల వెనక నిశ్శబ్దం ఉంది. నిశ్శబ్దం ఆలోచనకి మాటల రూపాన్నిచ్చింది. కాని ఆలోచన నిశ్శబ్దం కాదు. ఆలోచన లేదు. నిశ్శబ్దం ఉంది. నిశ్శబ్దం భేదించుకుంటూ పోయి ప్రోగుచేసి, మాటల రూపాన్నిచ్చింది. ఆలోచన ఎన్నటికీ చొచ్చుకుంటూ పోలేదు. నిశ్శబ్దంలోనే సంపర్కం ఉంటుంది.

డాక్టరు చెబుతున్నాడు ప్రతి దాంట్లోనూ తనకు అసంతృప్తి కలిగిందని; తన పనితోనూ తన సామర్థ్యంతోనూ, ఎంతో జాగ్రత్తగా పోషించుకున్న తన అభిప్రాయాలతోనూ. ఎన్నో రకాల సిద్ధాంతాలను ప్రయత్నించాడుట. కాని వాటన్నిటితోనూ అసంతృప్తి కలిగిందట. ఇక్కడికి వచ్చిన తరవాత ఎన్నో నెలలపాటు ఎన్నో రకాల గురువుల వద్దకు వెళ్లాడుట. కాని మరింత అసంతృప్తితో వచ్చేశాడుట. ఎన్నో సిద్ధాంతాలను ప్రయత్నించాడుట. నిత్యశంకాతత్వాన్ని కూడా. కాని ఇంకా అసంతృప్తి అలాగే ఉందిట.

ఇంతకీ మీరు సంతృప్తికోసం వెతికి దాన్ని కన్నుక్కోలేకపోయారా? సంతృప్తిని కోరటం వల్లనే అసంతృప్తి కలుగుతుందా? వెతకటం అనగానే తెలిసిన దానికోసం అని అర్థం వస్తుంది. మీరు అసంతృప్తిని పొందానంటున్నారు, అయినా ఇంకా అన్వేషిస్తున్నారు. మీకింకా అది దొరకలేదు