పుట:Mana-Jeevithalu.pdf/283

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
274
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

మార్చగలదు? ప్రపంచంలో జరిగేది ఉత్త తెలివి తక్కువే. నా తెలివి దాన్ని ఏమాత్రం మార్చలేదు. అదీకాక, ఒక వ్యక్తి తీసుకునే చర్య ప్రపంచం మీద ప్రభావాన్ని కలిగించటానికి ఎంతకాలం పడుతుందో ఆలోచించండి."

ప్రపంచం వేరూ, మీరు వేరూనా? సమాజం మీవంటి, నావంటి వారిచేత నిర్మించబడినది కాదా? నిర్మాణంలో మూల పరివర్తన తీసుకురావటానికి మీలో, నాలో మూల పరివర్తన రావద్దా? విలువలలో ప్రగాఢ పరివర్తన ఎలా వస్తుంది అది మీతోనూ నాతోనూ మొదలవకపోతే? ప్రస్తుత క్లిష్టపరిస్థితిలో సహాయ పడటానికి ఒక కొత్త సిద్ధాంతం కోసం, ఒక కొత్త ఆర్థిక ప్రణాళిక కోసం వెతకాలా? లేక తనలోని సంఘర్షణా, గందరగోళమే తాను కల్పించిన ప్రపంచం కూడా కాబట్టి తనలోని సంఘర్షణనీ, గందరగోళాన్నీ అర్థం చేసుకోవటం మొదలుపెట్టాలా? కొత్త సిద్ధాంతాలు మనిషికీ మనిషికీ మధ్య ఐక్యతను కలుగజేస్తాయా? నమ్మకాలు మనిషికీ మనిషికీ మధ్య విరోధాన్ని కలిగించవా? మన మధ్య ఉన్న సిద్ధాంతాలు అనే ఆటంకాలను తొలగించవద్దా - అన్ని ఆటంకాలూ సిద్ధాంత సంబంధమైనవే - మన సమస్యల గురించి ఆలోచించండి, నిర్ణయాలూ, సూత్రాల దృష్టిలో కాదు, సూటిగా దురభిప్రాయమనేది లేకుండా ఆలోచించండి. మన సమస్యలతో మనకెప్పుడూ తిన్నగా సంబంధం ఉండదు. ఎప్పుడూ ఏదో నమ్మకం ద్వారానో, సూత్రీకరణ ద్వారానో ఏర్పడుతుంది. మన సమస్యలతో మనకి ప్రత్యక్ష సంబంధం ఉన్నప్పుడే వాటిని మనం పరిష్కరించగలుగుతాం. మనిషికీ మనిషికీ మధ్య వైరుధ్యం రావటం మన సమస్యల వల్ల కాదు, వాటి గురించి మనకున్న అభిప్రాయాల వల్ల. సమస్యలు మనల్ని దగ్గరికి తెస్తాయి, అభిప్రాయాలు దూరం చేస్తాయి.

మీరసలు ఈ ప్రస్తుత క్లిష్ట పరిస్థితి గురించి విచారిస్తున్నట్లుగా ఎందుకున్నారో అడగవచ్చునా?

"ఓ, నాకు తెలియదు. అంత బాధ, అంత దుఃఖం, చూస్తుంటే దాని గురించి ఏమన్నా చెయ్యాలనిపిస్తుంది."

మీరు నిజంగా దాని గురించి విచారిస్తున్నారా, లేక కేవలం ఏదో ఒకటి చెయ్యాలనే ఆకాంక్షతో ఉన్నారా?