పుట:Mana-Jeevithalu.pdf/281

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
272
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

ఇచ్ఛా - వీటి చప్పుడు వల్ల అంతం కాదు. దీనిలోని సత్యాన్ని గ్రహించండి, నిశ్శబ్దం ఉంటుంది.


79. వృద్ధిలోకి రావాలనే ఆకాంక్ష

చంటిపిల్లవాడు రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడు. పాపం తల్లి తన చాతనైనదంతా చేసింది - పిల్లవాణ్ణి ఊరుకోబెట్టటానికి. విసుక్కుంది, లాలించింది, ఉయ్యాల ఊపింది. ఏం చేసినా లాభంలేకపోయింది. పిల్లవాడికి పళ్లొస్తూ ఉండి ఉండాలి. రాత్రంతా ఇంట్లో ఎవరికీ నిద్ర లేదు. చీకటిగా ఉన్న చెట్లపైన ఇప్పుడు తెల్లవారుతోంది. చిట్టచివరికి చంటిపిల్లవాడు శాంతించాడు. ఆకాశం వెలుగొందుతున్నకొద్దీ ఒక చిత్రమైన నిశ్చలత ఆవరించింది. ఎండిపోయిన కొమ్మలు సన్నగా బోసిగా, స్పష్టంగా ఉన్నాయి ఆకాశం ముందు. ఓ కుర్రవాడు కేకేశాడు. కుక్క మొరిగింది. లారీ ఒకటి రొదచేస్తూ వెళ్లింది. మరోరోజు మొదలైంది. అంతలోనే ఆతల్లి పిల్లవాణ్ణి ఎత్తుకుని జాగ్రత్తగా కప్పి బయటికి తీసుకువచ్చింది. గ్రామం అవతల ఉన్న దారివెంట తీసుకువెడుతూండి ఉండవచ్చు. ఆవిడ అలసిపోయి పీక్కుపోయినట్లుగా ఉంది రాత్రి నిద్రలేక. చంటిపిల్లవాడు మాత్రం బాగా నిద్రపోతున్నాడు.

త్వరలోనే సూర్యుడు చెట్లమీదికి వచ్చాడు. పచ్చగడ్డి మీద మంచు బిందువులు మెరుస్తున్నాయి. ఎంతో దూరం నుంచి రైలు కూతపెట్టింది. దూరాన ఉన్న పర్వతాలు చల్లగా నీడలా ఉన్నాయి. ఒక పెద్దపక్షి చప్పుడు చేస్తూ ఎగిరిపోయింది. మేము దాని ఏకాంతానికి భంగం కలిగించాం. హఠాత్తుగా సమీపించి ఉంటాం. దాని గుడ్లమీద ఎండుటాకులు కప్పేందుకు సమయం చాలలేదు దానికి. కప్పకపోయినా కొద్దిగా కూడ కనిపించటం లేదు. వాటిని అంత తెలివిగా దాచింది. ఇప్పుడు వాటిని అది దూరాన ఉన్న ఒక చెట్టుమీంచి చూస్తోంది. మేము కొద్దిరోజుల తరవాత ఆ తల్లిని పక్షిపిల్లలతో చూశాం. గూడు ఖాళీగా ఉంది.

దారి పొడుగునా నీడగా చల్లగా ఉంది. ఆ దారి తడిసిన అడవుల గుండా దూరాన ఉన్న కొండ పైదాకా పోతుంది. వెదుళ్లు బాగా వచ్చాయి.