పుట:Mana-Jeevithalu.pdf/278

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
269
నిశ్చలత, ఇచ్ఛ

ఉపయోగిస్తే వినాశకరం, కాని సరియైన మార్గంలో వినియోగిస్తే లాభ దాయకం. ఇచ్ఛ లేకుండా చర్య అనేదే జరగలేదు."

ప్రతి నాయకుడూ అధికారాన్ని ఒక లక్ష్యానికి సాధనంగానే వినియోగిస్తాడు. మామూలు మనిషి కూడా అదే పని చేస్తాడు. కాని, నాయకుడు అందరి క్షేమం కోసం వినియోగిస్తున్నానని చెబుతాడు. మామూలు మనిషి తన కోసమే తాను చూసుకుంటాడు. నియంతా, అధికారీ, నాయకుడూ - వీరి లక్ష్యమూ, వారిని అనుసరించేవారి లక్ష్యమూ ఒకటే, ఒకలాంటివే. ఒకటి విస్తృతమైతే మరొకటి అవుతుంది. రెండూ స్వయంకల్పితాలే. మనం ఒకదాన్ని నిరసించి రెండవదాన్ని మెచ్చుకుంటాం. కాని, లక్ష్యాలన్నీ తమకున్న దురభిప్రాయాలూ, ఉద్దేశాలూ, భయాలూ, ఆశలూ వీటి ఫలితంగా వచ్చినవే కాదా? మీరు ఇచ్ఛా, కృషీ, శక్తి వినియోగిస్తారు మహోత్కృష్టమైన దాని కోసం. మహోత్కృష్టమైనది కోరిక - అంటే ఇచ్ఛ రూపొందించినదే. ఇచ్ఛ తన లక్ష్యాన్ని తాను సృష్టించుకుని దానికోసం ప్రతిదాన్నీ త్యాగం చెయ్యటమో, అణచిపెట్టటమో చేస్తుంది. లక్ష్యం తానే. కాని, దాన్ని మహోత్కృష్టమైనది అనీ, ప్రభుత్వం అనీ, సిద్ధాంతం అనీ పేర్లు పెడుతుంది.

"ఇచ్ఛాశక్తి లేకుండా సంఘర్షణ అంతం కాగలదా?"

సంఘర్షణ తీరుల్ని, అది ఎలా బయలుదేరిందనేదాన్ని అవగాహన చేసుకోకుండా ఊరికే సంఘర్షణని అణచి పెట్టటంలోగాని, దాన్ని మహనీయంగా చేయటంలో గాని, దాని స్థానంలో మరొకదాన్ని ప్రత్యామ్నాయంగా ఉంచటంలో గాని విలువ ఏముంటుంది? ఒక రోగాన్ని మీరు అణచిపెట్టవచ్చు. కాని, అది మరోరూపంలో తలెత్తుతుంది. ఇచ్ఛ అనేదే సంఘర్షణ. పోరాటంలోంచి పుట్టినదే అది. ఇచ్ఛ అంటే ఒక ప్రయోజనాన్ని, ఒక మార్గాన్ని అనుసరించే కోరిక. కోరిక పనిచేసే రీతిని అర్థం చేసుకోకుండా కేవలం దాన్ని నిగ్రహించటం మాత్రమే చేయటం వల్ల మరింత మంటా, బాధా కొనితెచ్చుకున్నట్లవుతుంది. నిగ్రహం అంటే తప్పించుకోవటం - ఒక చిన్నపిల్లవాణ్ణిగాని, ఒక సమస్యని గాని అణచిపెట్టవచ్చు. కాని దానివల్ల పిల్లవాణ్ణి గాని సమస్యనిగాని అర్థం చేసుకున్నట్లుకాదు. ఒక లక్ష్యాన్ని చేరుకోవటం కన్న దాన్ని అర్థం చేసుకోవటం ఎక్కువ ముఖ్యం. ఇచ్ఛానుసారం చేసిన క్రియ