పుట:Mana-Jeevithalu.pdf/275

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
266
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

కనుక్కోవటానికి కల్పించటం మానెయ్యాలి. తన కల్పనలు లేకపోతే మనస్సే ఉండదు. జ్ఞానమూ, గతమూ తనకు తెలిసినదాన్నే రూపకల్పన చేయగలదు. తెలిసిన దానికి సాధనమైనది కొత్తదాన్ని కనిపెట్టేదిగా కాలేదు ఎన్నటికీ. కొత్తది కనుక్కోవటానికి తెలిసినదంతా అంతమైపోవాలి. అనుభవించటానికి అనుభవం అంతమవాలి. జ్ఞానం అవగాహనకు ఆటంకం.

"ఇంక మనకి ఏం మిగులుతుంది జ్ఞానం, అనుభవం, జ్ఞాపకం లేకపోతే? అప్పుడు మనం ఏమీ కాదు."

ఇప్పుడు మనం ఉన్నది అంతకన్న ఎక్కువ ఏమైనానా? "జ్ఞానం లేకపోతే మనం ఏమి కాదు" అని మీరు అనటం ఊరికే మాటల్లో ఉద్ఘాటిస్తున్నారంతే - ఆ స్థితిని అనుభవించకుండా. కాదా? మీరామాటలు అంటున్నప్పుడు భయానుభూతి కలిగింది - నగ్నంగా మిగిలిపోవాలన్న భయం. ఈ కూడబెట్టినవన్నీ లేకపోతే మీరు ఏమీకాదు - అదే సత్యం. అలాగే ఎందుకు ఉండకూడదు? ఎందుకీ వేషాలూ మోసాలూ? ఈ ఏమీ లేకపోవటాన్ని మనం కల్పనలతో, ఆశలతో, సౌఖ్యదాయకమైన ఊహలతో కప్పి ఉంచాం. ఈ కప్పిన వాటి క్రింద ఉన్న మనం ఏమీ కాదు. ఏదో వేదాంత భావం కాదు, వాస్తవంగానే ఏమీ కాదు. ఆ ఏమీ కాకపోవటమనే దాన్ని అనుభవించటమే వివేకానికి ఆరంభం.

మనకి తెలియదని చెప్పటానికి ఎంత సిగ్గుపడతాం! తెలియదన్న వాస్తవాన్ని మాటలతో వివరాలతో కప్పిపుచ్చుతాం. వాస్తవంగా మీరు మీ భార్యని తెలుసుకోరు. మీ ఇరుగుపొరుగుని తెలుసుకోరు. ఎలా తెలుసుకుంటారు. మిమ్మల్ని మీరే తెలుసుకోనప్పుడు? మీవద్ద మీగురించి బోలెడు వివరాలూ, నిర్ణయాలూ, సమర్థనలూ ఉన్నాయి. కాని, నిగూఢమైన దాన్ని మీరు తెలుసుకోలేదు. జ్ఞానం అనబడే సమర్థనలూ, నిర్ణయాలూ ఉన్నస్థితిని అనుభవించకుండా ఆటంక పరుస్తాయి. అమాయకంగా లేకుండా ఉంటే వివేకం ఎలా కలుగుతుంది? గతం మరణించకుండా అమాయకత ఎలా పునరుద్భవిస్తుంది? మరణించటం క్షణక్షణానికి జరుగుతుంది. మరణించటం అంటే కూడబెట్టకుండా ఉండటం. అనుభవించే వాని అనుభవం మరణించాలి అనుభవం లేకపోతే, జ్ఞానం లేకపోతే అనుభవించే