పుట:Mana-Jeevithalu.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జ్ఞానులా, వివేకవంతులా?

261

లోతులేని మనస్సు దీనిలోని సత్యాన్ని గ్రహించలేదు. సత్యం కోసం వెతకటంలో మునిగి ఉంటుంది. ఈ కార్యకలాపమే సత్యాన్ని గ్రహించకుండా చేస్తుంది. సత్యం అంటే ఆచరణ, అంతేకాని లోతులేని మనస్సు వాంఛించేదీ, అభివృద్ధిని కాంక్షించేదీ కాదు. సత్యంలోనే మంచితనం, అందం ఉంటుంది, నాట్యంలోనూ ప్రణాళికల్లోనూ మాటల్లోనూ కాదు. లోతు లేని వానికి సత్యమే స్వేచ్ఛ కలిగిస్తుంది, అంతేకాని, స్వేచ్ఛగా ఉండాలనుకునే పథకం కాదు. లోతులేనిది - అంటే మనస్సు తనకై తాను స్వేచ్ఛ పొందలేదు. ఒక ప్రభావం నుంచి మరొక ప్రభావానికి జరుగుతూ ఉంటుంది - ఇంకొకటి ఎక్కువ స్వేచ్ఛగా ఉంటుందనుకుని. ఇంకోటి ఎప్పటికీ స్వేచ్ఛగా ఉండదు. అదొక ప్రభావం, తక్కువ దాన్ని మించినది. అవుతూ ఉండటం - బుద్ధుడు, లేదా యజమాని అవాలనుకునే వాని కార్యకలాపం లోతు లేనిది. లోతులేని వారు ఎప్పుడూ తామున్న స్థితి గురించి భయపడుతూనే ఉంటారు. కాని, వారున్న స్థితే సత్యం. ఉన్నస్థితిని నిశ్శబ్దంగా గమనించటమే సత్యం. సత్యమే ఉన్నస్థితిలో పరివర్తన తీసుకొస్తుంది.

77. జ్ఞానులా, వివేకవంతులా?

ఎన్నో నెలల నుంచి ఉన్న దుమ్మునీ, ఎండనీ వానలు తుడిచి పెట్టేశాయి. ఆకులు స్వచ్ఛంగా మెరుస్తున్నాయి. చిగుళ్లు తొడగటం మొదలు పెట్టాయి. రాత్రి పొడుగుతా కప్పల బెకబెకలతో నిండింది వాతావరణం. కొంచెం సేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ మొదలుపెడతాయి. నది వేగంగా ప్రవహిస్తోంది. గాలి మృదువుగా ఉంది. వానలు అయిపోలేదింకా. నల్లని మబ్బులు గుమిగూడుతున్నాయి. సూర్యుడు మరుగున ఉన్నాడు. నేలా చెట్లూ, ప్రకృతీ - అంతా మరొకసారి పరిశుద్ధం కావటానికీ నిరీక్షిస్తున్నట్లుగా ఉంది. రోడ్డు నల్లమన్ను రంగులో ఉంది. పిల్లలు నీటిమడుగుల్లో ఆడుతున్నారు చుట్టూ గోడలుపెట్టి. నెలల తరబడి వేడిమి తరవాత వాతావరణం హాయిగా ఉంది. నేలనిండా పచ్చగడ్డి పెరుగుతోంది. ప్రతిదీ పునఃసృష్టి చెందుతోంది.