పుట:Mana-Jeevithalu.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

258

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

సైన్యంతో ఉన్నాను. తక్కిన వాళ్లలాగే నేను కూడా దేశభక్తి భావంతో దాంట్లో చేరాను. ఆ సమయంలో చంపటంలోని అర్థాన్ని గురించి ఆలోచించలేదు. అది చెయ్యవలసిన పని. మేము చేరాం అంతే. కాని, ఇప్పుడు నేను సహాయం చేస్తున్నది ఆధ్యాత్మికంగా ఉన్నవారికి."

ఆధ్యాత్మికంగా ఉండటం అంటే మీకు అర్థం తెలుసునా? ఒకటి మాత్రం నిజం. అభివృద్ధి చెందాలనే ఆకాంక్ష కలిగి ఉండటం ఆధ్యాత్మికత కానేకాదు. వాళ్లకి అభివృద్ధి చెందాలనే ఆకాంక్షలేదా?

"ఉందనే అనుకుంటాను. ఈ విషయాలు నేనెప్పుడూ ఆలోచించ లేదు. ఒక చక్కని - ప్రయోజనానికి తోడ్పడాలని మాత్రమే అనుకున్నాను."

అభివృద్ధి చెందాలనే ఆకాంక్ష ఉండటం, దాన్ని దివ్య ప్రభువులు, మానవత్వం, కళ, సౌభ్రాతృత్వం, అంటూ ఎన్నో గొప్పగా ధ్వనించే పదాలతో కప్పి ఉంచటం చక్కతనమా? తనతో బాటు పక్కనున్న వాళ్లనీ, అవతలి తీరాన ఉన్న వాళ్లనీ అందరినీ కలుపుకునే ఆత్మకేంద్రీకరణ భారంతో ఉండటం ఆధ్యాత్మికతా? ఆధ్యాత్మికంగా ఉన్నవారికి మీరు సహాయపడుతున్నానను కుంటున్నారు. అదంతా ఏమిటో తెలుసుకోకుండానే మిమ్మల్ని వాళ్లు వినియోగించుకోవటానికి ఇష్టపడుతున్నారు.

"అవును. అదంతా తెలివితక్కువే కదా? నేను చేసే దానికి అంతరాయం కలగటం నాకిష్టంలేదు. కాని నాదో సమస్య ఉంది. మీరు చెప్పేది మరింత కలవరపరుస్తూ ఉంది."

మీకు కలవరం కలగవద్దా? మనకి కలవరం కలిగినప్పుడే, మనం మేల్కొన్నప్పుడే, గమనించటం, తెలుసుకోవటం మొదలుపెడతాం. మన తెలివితక్కువతనం వల్లనే మనల్ని వాళ్ల లాభానికి వినియోగించుకుంటారు. గడుసు వాళ్లు దేశం పేరుతోనూ, దేవుడి పేరుతోనూ, మరికొందరు సిద్ధాంతం పేరుతోనూ మనల్ని ఉపయోగించుకుంటారు. చాకచక్యం ఉన్నవాళ్లే వినియోగించుకున్నప్పటికీ తెలివితక్కువతనం లోకానికి మంచినెలా చేయ గలదు? గడుసువాళ్లు తెలివితక్కువవాళ్లే - ఎందుకంటే, వాళ్ల కార్యకలాపాలు వాళ్లని ఎక్కడికి లాక్కుపోతాయో వాళ్లకే తెలియదు. వాళ్ల ఆలోచన