పుట:Mana-Jeevithalu.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

256

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

ప్రేమ ఐక్యం చేసుకోవటం కాదు; ప్రేమించేవారి గురించి ఆలోచన కాదు. ప్రేమ ఉన్నప్పుడు దాన్ని గురించి ఆలోచించరు. అది లేనప్పుడే మీకూ, మీరు ప్రేమించేదానికి మధ్య దూరం ఉన్నప్పుడే దాన్ని గురించి ఆలోచిస్తారు. ప్రత్యక్ష సంపర్కం ఉన్నప్పుడు ఆలోచన ఉండదు. కల్పితరూపం ఉండదు, పోటీపడే జ్ఞాపకం ఉండదు. సంపర్కం తెగిపోయినప్పుడే, ఏ స్థాయిలోనైనా సరే, ఆ ఆలోచనా ప్రక్రియ, ఊహించటం మొదలవుతుంది. ప్రేమ మనస్సుకి చెందినది కాదు. మనస్సు, ఈర్ష్య, పట్టుకుని వ్రేలాడటం, గతాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవటం, పోగొట్టుకోవటం, రేపు గురించి తపించటం - వీటి వల్ల దుఃఖం, ఆదుర్దా అనే పొగ సృష్టింపబడుతుంది. ఈ పొగ జ్వాలని అణచివేస్తుంది. పొగ లేనప్పుడు జ్వాల ఉంటుంది. రెండూ ఒకచోట ఉండలేవు. అవి కలిసి ఉంటాయనే ఆలోచన కేవలం ఇచ్ఛ మాత్రమే. ఇచ్ఛ ఆలోచనా రూపమే. ఆలోచన ప్రేమ కాదు.

76. స్వలాభం కోసం వినియోగించుకోవటం, కార్యకలాపం

తెల్లవారటంతోనే పక్షులు కిలకిలమంటూ తెగ గొడవ చేస్తున్నాయి. సూర్యకాంతి చెట్లపైన మాత్రమే పడుతోంది. చిక్కని నీడల్లో ఇంకా వెలుగు పడటం లేదు. గడ్డిమీద అంతక్రితమే పాము వెళ్లి ఉంటుంది. మంచుమీద సన్నగా పొడుగ్గా చారపడింది. ఆకాశం రంగు ఇంకా పోలేదు. పెద్ద పెద్ద తెల్లని మేఘాలు పోగవుతున్నాయి. ఉన్నట్లుండి పక్షులచప్పుడు ఆగిపోయింది. మళ్లీ హెచ్చరికతో, అరుపులతో ఎక్కువైంది. ఒక పిల్లి వచ్చి పొద క్రింద పడుకుంది. పెద్ద డేగ ఒకటి తెలుపు నలుపు రంగుల్లో ఉన్న ఒక పక్షిని పట్టుకుని పదునుగా వంపుతిరిగిన ముక్కుతో చీల్చేస్తోంది. దొరికిన ఆహారాన్ని శక్తికొద్దీ ఆత్రుతగా పట్టుకుని, రెండు మూడు కాకులు దగ్గరకు రాబోతే బెదిరించింది. డేగ కన్నులు పసుపు పచ్చగా ఉన్నాయి మధ్యని నల్లని చారలతో. ఆ కళ్లు మమ్మల్నీ, కాకుల్నీ రెప్పవాల్చకుండా గమనిస్తున్నాయి.

"నేను ఎందుకు వినియోగింపబడకూడదు? ఒక ప్రయోజనం కోసం.