పుట:Mana-Jeevithalu.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

254

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

మీ భార్య లేకపోతే మీరు ఒంటరిగా అయిపోతారు. నిశితంగా చూస్తే మీరు తప్పిపోయినట్లవుతారు. ఆవిడ మీకు అత్యవసరం, కారా? మీ ఆనందం కోసం ఆవిడపైన ఆధారపడుతున్నారు. ఈ ఆధారపడటాన్నే ప్రేమ అంటున్నారు. మీరు ఒంటరిగా ఉండటానికి భయపడుతున్నారు. మీ ఒంటరితనాన్ని కప్పిపుచ్చటానికి ఆవిడ ఎప్పుడూ ఉన్నారు, మీరు ఆవిడకి ఉన్నట్లు. కాని ఆ యథార్థం ఇంకా అలాగే ఉంది, కాదా? ఒంటరితనాన్ని కప్పిపుచ్చుకోవటానికి మనం ఒకరినొకరు ఉపయోగించుకుంటాం. అనేక మార్గాల్లో దాన్నుంచి తప్పించుకుంటాం వివిధ బాంధవ్యరూపాల ద్వారా. అటువంటి ప్రతి బాంధవ్యం ఒక ఆధారం అవుతుంది. సంగీతం నాకు ఆనందాన్నిస్తుంది. కాబట్టి రేడియో వింటాను. అది నానుంచి నన్ను దూరంగా తీసుకుపోతుంది. పుస్తకాలూ, జ్ఞానం కూడా నానుంచి నేను పారిపోయేందుకు ఎంతో వీలైన మార్గాలు. వీటన్నిటి మీదా ఆధారపడతాం.

"నా నుంచి నేను ఎందుకు తప్పించుకోకూడదు? నేను గర్వపడేందుకేమీ లేదు నాలో. నా భార్యతో ఐక్యం అయితే, ఆవిడ నాకన్న ఎంతో నయం కనుక, నన్ను నేను తప్పించుకుంటాను."

నిజమే. మూడొంతుల మంది అలాగే తమ్ముతాము తప్పించుకుంటారు. కాని మిమ్మల్ని మీరు తప్పించుకోవటం వల్ల మీరు ఆధారపడుతున్నారు. ఆధారపడటం అంతకంతకు ఎక్కువవుతుంది. పారిపోయే మార్గాలు మరింత అత్యవసరమవుతాయి, ఉన్నస్థితి అంటే ఉండే భయానికి తగినట్లుగా. భార్య, పుస్తకం, రేడియో అత్యంత ముఖ్యంఅవుతాయి. పారిపోయే మార్గాలు అతి ముఖ్యం, అతి విలువైనవి అయిపోతాయి. నన్ను నేను తప్పించుకుపోవటానికి నా భార్యని ఉపయోగించుకుంటాను. అందువల్లనే ఆవిడపై మమత. ఆవిణ్ణి సొంతం చేసుకోవాలి. ఆవిణ్ణి పోగొట్టుకోకూడదు. ఆవిడ కూడా మీ సొంతం అవాలనుకుంటుంది. ఆవిడ కూడా మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు కనుక. తప్పించుకునే అవసరం ఇద్దరికీ ఉంది. ఒకరినొకరు ఉపయోగించుకుంటున్నారు. ఈ ఉపయోగించుకోవటాన్నే ప్రేమ అంటారు. మీరు ఉన్నట్లుగా మీకిష్టం లేదు. అందుచేత ఉన్నస్థితి నుంచి, అంటే మీ నుంచి మీరు పారిపోతున్నారు.