పుట:Mana-Jeevithalu.pdf/262

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
253
భయం, తప్పించుకునే మార్గం

"నాకు నా భార్యకీ పరస్పర ప్రేమ ఉంది. తను ఇంకో మగవాడి వైపు చూడాలని కూడా అనుకోదు. నేను పరస్త్రీలవైపు ఆకర్షితుణ్ణి కాను. మేము ఒకరితో ఒకరం పరిపూర్ణతను పొందుతాం. పిల్లలగురించి ఆదుర్దా ఉంటుంది. చెయ్యగలిగిందంతా చేస్తాం. ఆర్దికంగా ఈనాటి గందరగోళంలో వాళ్ళకి ధనరక్షణ ఎవ్వరూ కల్పించలేరు. వాళ్ళకి చేతనైన బాగు వాళ్ళు చేసుకోవాలి. నా ఉద్యోగం సురక్షితంగా ఉంటుంది. కాని నా భార్యకి ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చుననే భయం ఉండటం సహజం."

అందుచేత మీరు మీ ప్రగాఢ బాంధవ్యం గురించి నిశ్చయంగానే ఉన్నారు. ఎందువల్ల అంత నిశ్చయంగా ఉన్నారు?

"నాకు తెలియదు. ఉన్నానంతే. కొన్ని విషయాలు అలాగే ఉంటాయనుకోవాలి. ఉండవా?"

అదికాదు అసలు విషయం. మనం దాన్ని గురించి తెలుసుకుందామా? మీ అంతరంగిక సంబంధం గురించి దేనివల్ల మీరు అంత నిశ్చయంగా ఉన్నారు? మీరూ మీ భార్యా ఒకరితో ఒకరు సంపూర్ణతని పొందుతున్నారని మీరు అనటంలో అర్థం ఏమిటి?

"ఒకరివల్ల ఒకరం పరస్పరం ఆనందం పొందుతున్నాం; తోడుగా ఉండటం, అర్థం చేసుకోవటం, ఇలా. గాఢంగా ఆలోచిస్తే మేం ఒకరిమీద ఒకరం ఆధారపడుతున్నాం. మా ఇద్దరిలో ఏ ఒక్కరికి ఏం జరిగినా అది పెద్ద ఆఘాతం అవుతుంది. ఆ ఉద్దేశంలో మేము పరస్పరం ఆధారపడి ఉన్నాం."

"ఆధారపడటం" అనేదానికి మీరు చెప్పే అర్థం ఏమిటి? ఆవిడ లేకపోతే మీరు తప్పిపోయినట్లుగా అవుతారనీ, ఒంటరిగా ఉన్నట్లు భావన కలుగుతుందనీనా? అదేనా? ఆవిడకూడా అలాగే భావిస్తారు. అందుచేత మీరు ఒకరిపైన ఒకరు ఆధారపడి ఉన్నారు.

"అందులో తప్పేముంది?"

మనం నిరసించటం లేదు. నిర్ణయించటం లేదు. పరిశీలిస్తున్నాం. అంతే. ఇదంతా తెలుసుకోవాలని మీరు నిజంగా అనుకుంటున్నారా? సరే. అయితే తెలుసుకుందాం.