పుట:Mana-Jeevithalu.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

252

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

ఉంది. ఈ భయంకరమైన స్థితినుంచి విముక్తి పొందాలని కోరిక."

మీరు నిజంగా విముక్తి పొందాలనుకుంటున్నారా, లేక ఊరికే అంటున్నారా?

నేను యథాలాపంగా మాట్లాడుతున్నట్లు అనిపించవచ్చు మీకు. ఈ భయం పోవటానికి ఏమైనా చేస్తాను. "నేను అంత దైవభక్తి ఉన్నవాణ్ణి కాదు, కాని, అది నాలో లేకుండా చెయ్యమని దేవుని ప్రార్థించాను కూడా. నేను పనిలోనో, ఆటల్లోనో ఆసక్తికరంగా ఉన్నప్పుడు అది ఉండదు. కాని భీకర మృగం లాగ ఎదురు చూస్తూ ఉంటుంది. అంతలోనే నాతో కూడా ఉంటుంది మళ్ళీ."

ఇప్పుడు మీకా భయం ఉందా? అది ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుస్తోందా? ఆ భయం వ్యక్తంగా ఉందా? నిగూఢంగా ఉందా?

"ఉందన్న అనుభూతి కలుగుతుంది. కాని అది వ్యక్తంగా ఉందో, అవ్యక్తంగా ఉందో తెలియదు."

ఎంతో దూరంలో ఉన్నట్లు అనుభూతి కలుగుతుందా, దగ్గరలో ఉన్నట్లా - కైవారంలో, దూరం దృష్టిలో కాదు, భావన రూపంలో?

"దాన్ని గురించి తెలుస్తున్నప్పుడు ఎంతో దగ్గరలో ఉన్నట్లుంటుంది. కాని దానికీ దీనికీ ఏమిటి సంబంధం?"

దేనితోనైనా సంబంధం ఉన్నప్పుడే భయం కలుగుతుంది. అది మీ కుటుంబం, మీపనీ, మీ భవిష్యత్తు గురించీ, మరణం గురించీ ఆలోచిస్తూ ఉండటం, ఏదైనా కావచ్చు. మీకు మరణం అంటే భయమా?

"ప్రత్యేకంగా లేదు. అయితే, చాలాకాలం తీసుకోకుండా త్వరగా చచ్చిపోవాలని మాత్రం ఉంది. నా కుటుంబం గురించి గాని, నా ఉద్యోగం గురించి గాని. నాకు ఆదుర్దా లేదు."

అలా అయితే, పైపై సంబంధాలు భయానికి కారణం కానట్లయితే, ఏదో లోలోపలిదై ఉండాలి. అదేమిటో సూచించవచ్చు ఎవరైనా. కాని, దాన్ని మీ అంతట మీరే తెలుసుకోగలిగితే దానికి మరింత విలువ ఉంటుంది. పైపై సంబంధాల గురించి మీరు ఎందువల్ల భయపడటంలేదు?