పుట:Mana-Jeevithalu.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సమైక్యత

249

మళ్లీ మనకి ఊహలు, ఉద్దేశాలూ, ఏమవుతుందోననేదాన్ని గురించి, అంతేకాని జరిగేదాన్ని ప్రత్యక్షంగా అనుభవించం. ఊహలు అవగాహనకి అడ్డు తగుల్తాయి - నిర్ణయాలూ, సమర్ధనల్లాగే. ఊహలూ, ఆదర్శాలూ మనం సాధించటానికీ, అవటానికీ పోరాడేటట్లు చేస్తున్నాయా? నేను ఇది, ఆదర్శం నన్ను అది అవటానికి పోరాడేటట్లు చేస్తుందా? ఆదర్శమే సంఘర్షణకి కారణమా? ఆదర్శం ఉన్న స్థితికి పూర్తిగా విరుద్ధమైనది కాదా? అది పూర్తిగా వేరైనదైతే, దానికీ ఉన్నస్థితికీ సంబంధం ఉండదు, అలాంటప్పుడు ఉన్నస్థితి ఆదర్శంలా కాలేదు. అవటానికి ఉన్నస్థితికీ, ఆదర్శానికీ గానీ లక్ష్యానికి గాని సంబంధం ఉండాలి. ఆదర్శం మనం పోరాడేలా ప్రోత్సహిస్తుందంటున్నారు మీరు. అంచేత ఆదర్శం ఎలా వస్తుందో తెలుసుకుందాం. ఆదర్శం మనస్సు కల్పించినది కాదా?

"నేను మీలా ఉండాలనుకుంటున్నాను. అది కల్పితమా?"

నిశ్చయంగా. మనస్సులో ఒక భావం కలుగుతుంది. సంతోషకరమైనది కావచ్చు. అది అ భావం లాగ ఉండాలనుకుంటుంది. అదే మీ కోరికకి రూపకల్పన చేయటం. మీరు ఇది. ఇది మీకు ఇష్టం లేదు. మీరు అది అవానుకుంటున్నారు. మీ కిష్టమైనది అది. ఆదర్శం స్వయం కల్పితమే. దానికి వ్యతిరేకంగా ఉన్నస్థితి విస్తృతం కావటం. అది వ్యతిరేకమైనది కానేకాదు. ఉన్నస్థితి కొనసాగుతూ ఉండటమే, కొన్ని మార్పులతో కావచ్చు. కల్పన స్వయం ఇచ్ఛానుసారంగా జరిగినది. ఆ కల్పిత రూపాన్ని చేరుకోవటానికి జరిపే పోరాటమే సంఘర్షణ. ఉన్నస్థితి ఆదర్శరూపాన్ని కల్పించుకుని దాని కోసం పోరాటం సల్పుతుంది. ఈ పోరాటాన్నే అవటం అంటున్నాం. ఈ సంఘర్షణ ఉన్నస్థితి తను కాని స్థితిలాగ అవటానికి ప్రయత్నించటమే. కాని స్థితి ఆదర్శమూ, స్వయం కల్పితమూ. మీరు ఏదో అవాలనుకుని కష్టపడుతున్నారు. కాని, ఆ ఏదో అన్నది మీలోని భాగమే. ఆదర్శం మీరు కల్పించినదే. మీ మనస్సు మీమీద ఎలా చమత్కారం చేసిందో చూడండి. మీరు మాటలకోసం కష్టపడుతున్నారు. మీరు కల్పించినదాన్నే, మీ నీడనే వెంటాడుతున్నారు. మీరు హింసాత్మకంగా ఉన్నారు. అహింసాయుతంగా అవాలని పోరాటం సల్పుతున్నారు. అది ఆదర్శం. ఆదర్శం