పుట:Mana-Jeevithalu.pdf/257

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
248
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

నుంచి ఎలా ముక్తిపొందటమా, దాని వెనక ఏముందా అని కాదు. జీవించటం, అవటం అనేవి రెండు వేరువేరు స్థితులు, కావా? బ్రతకటానికి కృషి అవసరం కావచ్చు. కాని మనం అవటం అనే ప్రక్రియ గురించి విచారిస్తున్నాం, ఇంకా బాగా అవాలని, ఏదో అవాలని పొందే మానసిక తపన, ఉన్నస్థితిని దానికి విరుద్ధంగా మార్చటానికి జరిగే పోరాటం. మానసికంగా అవాలనుకోవటం వల్లనే మన దైనందిన జీవితం బాధాకరంగా పోటీతో కూడినదిగా, ఒక పెద్ద సంఘర్షణగా తయారవుతోందేమో. అవటం అంటే మనం అర్థం చేసుకున్న దేమిటి? పూజారి దేవాలయాధికారి అవాలనుకోవటం, శిష్యుడు గురువు అవాలనుకోవటంలాగ మానసికంగా అవాలనుకోవటం. ఈ అవాలనుకునే ప్రక్రియతో కృషి జరుగుతుంది. వ్యక్తంగా గాని, అవ్యక్తంగా గాని, ఉన్న స్థితిని ఇంకోలా మార్చాలనే పోరాటమే ఇది. కాదా? నేను ఇది, నేను అది అవాలనుకుంటున్నాను. ఈ అవటంలో అనేక సంఘర్షణలు ఉంటాయి. ఒకదాని తరవాత మరొకటి. అది అయిన తరవాత మరొక అది, దాని తరవాత మరొకటి, అనంతంగా ఉంటుంది. ఈ ఇది అది అవటం అనేదానికి అంతం లేదు. అందుచేత, సంఘర్షణ అనంతమవుతుంది. నేను ఉన్నట్లుగా కాకుండా వేరుగా ఎందుకవాలనుకుంటున్నాను?

"మనం ప్రభావితం కావటం వల్లా, సాంఘిక ప్రభావాల వల్లా, మన ఆదర్శాల వల్లా. మనం చెయ్యగలిగిందేమీ లేదు. అది మన స్వభావం."

మనం చెయ్యగలిగిందేమీ లేదు అనేసరికి చర్య ముగిసిపోతుంది. బద్ధకంగా ఉండే మనస్సే ఇలా ఉద్ఘాటించి బాధని భరిస్తూ ఉంటుంది. అది తెలివి తక్కువతనం. మనం అ విధంగా ఎందుకు ప్రభావితం అయి ఉన్నాం? మనల్ని ఎవరు ప్రభావితం చేస్తున్నారు? మనం ప్రభావితం కావటానికి తలవొగ్గుతాం కాబట్టి మనమే ఆ ప్రభావాలను తయారుచేస్తాం. మనం ఇది అయి ఉన్నప్పుడు అది అవటానికి పోరాటం సలిపేలా చేసేది ఆదర్శమా? లక్ష్యమూ, ఆదర్శ స్థితీనా సంఘర్షణ కల్పించేది? ఒక లక్ష్యం కోసం పోరాటం జరపకపోతే మనం ధ్వంసం అయిపోతామా?

"నిస్సంశయంగా నిలవుండిపోతాం, చెడునుంచి మరింత చెడుగా అవుతాం. నరకంలో పడటం సులభం, స్వర్గాన్ని అధిరోహించటం కష్టం."