పుట:Mana-Jeevithalu.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సమైక్యత

247

మనలోనూ కూడా ఈ విధ్వంసం త్వరత్వరగా జరుగుతూండటం చూస్తున్నాం. ఈ ముక్కముక్కలైపోవటాన్ని ఎలా ఆపటం? మనలో సమైక్యత కలగటానికి ఎలా వీలవుతుంది?"

విధ్వంసం జరిగే విధానాలను మనం జాగ్రత్తగా పరిశీలించగలిగినట్లయితే, సమైక్యత కలుగుతుంది. సమైక్యత మన జీవితంలోని ఒకటి రెండుస్థాయిల్లో మాత్రమే లేదు. అన్నీ కలిసి సమకూడటంలోనే ఉంటుంది. అది జరగగలిగే ముందు, విధ్వంసం అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి, వద్దా? సంఘర్షణ విధ్వంసానికి సూచనా? మనం నిర్వచనం కోసం ప్రయత్నించటం లేదు, ఆమాట వెనక ఉన్న అర్థాన్ని తెలుసుకోవటమే.

"పోరాటం అనివార్యం కాదా? బ్రతుకంతా పోరాటమే. పోరాటం లేకపోతే క్షీణత ఏర్పడుతుంది. ఒక లక్ష్యం కోసం నేను పోరాడకపోతే నేను ధ్వంసమైపోతాను. ఊపిరి తీసుకోవటం లాగే పోరాటం కూడా అత్యవసరం."

కచ్చితంగా చెప్పటంతో పరిశీలన అంతా ఆగిపోతుంది. విధ్వంసం అవటానికి సంబంధించిన అంశాలేమిటి అని తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నాం మనం. వాటిలో సంఘర్షణ, పోరాటం ఒకటి కావచ్చు, సంఘర్షణ, పోరాటం అంటే మన ఉద్దేశంలో ఏమిటి?

"పోటీ పడటం, కష్టపడటం, కృషి చెయ్యటం, సాధించాలనే ఇచ్ఛ, అసంతృప్తి మొదలైనవి."

పోరాటం బ్రతుకులోని ఒక స్థాయిలోనే కాదు, అన్ని స్థాయిల్లోనూ ఏదైనా అవుతూ ఉండటం పోరాటం కాదా? గుమాస్తా యజమాని అవటం, పూజారి మతగురువు అవటం, శిష్యుడు గురువు అవటం - ఇలా మానసికంగా అవటమే కృషి, పోరాటం.

"ఈ అవటం అనేది లేకుండా ఉండగలమా? అదొక అవసరం కాదా? సంఘర్షణ నుంచి ఎవరైనా విముక్తి ఎలా పొందగలరు? ఈ కృషికి వెనక భయం లేదా."

మనం కేవలం మాటల్లోనే కాక అనుభవంలో ఈ విధ్వంసం ఎలా జరుగుతుందో తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నాం, అంతేకాని, సంఘర్షణ