పుట:Mana-Jeevithalu.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

246

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

దాని శరీరం నిండా పుళ్లే. కాని తోక ఆడిస్తోంది తన పిల్లల్ని చూసుకుని గర్వంగా. ఓ నెలో ఎంతో తప్ప బ్రతక్కపోవచ్చు. వీధమ్మట తిరుగుతూ మురికి వీధుల్లోనో, గ్రామంలోనో కనిపించినదల్లా ఏరుకుంటూ ఆకలితో ఎప్పుడూ ముందుకి ఉరికే కుక్కల్లో అదొకటి. మనుషులు దానిమీదకి రాళ్లు విసురుతూ తలుపు దగ్గరనుంచి తరిమేస్తారు. వాటిని తప్పించుకోవాలి కాని ఇక్కడ నీడలో పాత జ్ఞాపకాలు ఎంతో దూరమై పోయాయి. అలిసిపోయి ఉంది. కుక్కపిల్లల్ని ముద్దు చేసి వాటితో కబుర్లు చెప్పటం జరుగుతోంది. అది మధ్యాహ్నం; విశాలమైన నది మీంచి వచ్చేగాలి స్వచ్ఛంగానూ చల్లగానూ ఉంది. ఆ క్షణంలో తృప్తిగా ఉంది. తరవాత తిండి ఎక్కడ నుంచి వస్తుందన్నది వేరే విషయం. దానికోసం ఇప్పటినుంచీ బాధపడటం ఎందుకు?

గ్రామం అవతల నది ఒడ్డున పచ్చని పొలాలకవతల దుమ్మూ రొదతో ఉండే బాటకి దిగువున ఉన్న ఇంట్లో జనం ఎదురువస్తున్నారు మాట్లడటానికి. అన్నిరకాల వాళ్లూ ఉన్నారు. ఆలోచనాపరులూ, ఆత్రుతలో ఉన్నవారూ, బద్ధకంగా ఉన్నవారూ, నిర్వచనాల ప్రకారం, నిర్ణయాల ప్రకారం జీవించేవారూ, ఆలోచనాపరులు శాంతంగా ఉన్నారు. సమయస్ఫూర్తి ఉన్నవారు మెల్లిగా నసుగుతున్నవాళ్లను చూసి విసుక్కుంటున్నారు. నెమ్మదిగా ఉన్నవాళ్లు తొందరపడేవాళ్లతో కలిసిరావలసి వచ్చింది. అవగాహన మెరుపులా వస్తుంది. మెరుపుకీ మెరుపుకీ మధ్య నిశ్శబ్ద విరామం ఉండాలి. అర్థం చేసుకోవటం మాటల్లో కాదు. మేధా సంబంధమైన అవగాహన అనేది లేదు. మేధా సంబంధమైన అవగాహన మాటల స్థాయిలోనే జరుగుతుంది. ఆలోచనా ఫలితం కాదు అవగాహన. ఆలోచన అనేది మాటల్లో, సంకేతాల్లో, రూపకల్పనా ప్రక్రియలో ఉంటుంది. జ్ఞాపకం లేకుండా ఆలోచన ఉండదు. జ్ఞాపకమే మాట, సంకేతం, మనశ్చిత్రం. ఈ స్థాయిలో అవగాహన కలగదు. రెండుమాటల మధ్య ఏర్పడిన ఖాళీలో మాట ఆలోచనగా రూపొందే లోపున అవగాహన కలుగుతుంది. అవగాహన సమయస్ఫూర్తి ఉన్నవారికి గాని, నెమ్మదిగా ఉన్నవారికి గాని కలుగుతుందని కాదు, అపరిమితమైన ఈ విరామస్థితిని తెలుసుకున్నవారికి మాత్రమే కలుగుతుంది.

"విధ్వంసం అంటే ఏమిటి? ప్రపంచంలోని మానవ సంబంధాల్లోనూ,