పుట:Mana-Jeevithalu.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

238

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

అంటారు. మీరు వాళ్లని యుద్ధప్రియులనీ, వారి వ్యవస్థ ఆర్థిక వినాశానికి దారితీయక తప్పదనీ అంటారు. అందుచేత మీ ఇరువురూ సిద్ధాంతాల గురించే విచారిస్తున్నారు, జనానికి తిండిపెట్టాలనీ, వారికి ఆనందాన్ని కలిగించాలనీ కాదు. రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతోంది - మనిషి సంగతి మరుగునపడిపోయి.

"మనిషిని రక్షించటానికే మనిషిని మరిచిపోవటం జరుగుతుంది. భావి మానవుని కోసం నేటి మనిషిని త్యాగం చేస్తాం."

భవిష్యత్తుకోసం ప్రస్తుతాన్ని హింసామార్గంలో అంతం చేస్తారు. భవిష్యత్తుని నిర్ణయించే అధికారాన్ని మీరు ప్రభుత్వం పేరుతో వహిస్తారు. చర్చి దేవుడి పేరుతో చేసింది. మీ ఇరువురికి దేవుళ్లున్నారు, పవిత్ర గ్రంథాలున్నాయి. మీ ఇరువురికీ వ్యాఖ్యాన కర్తలూ, మతప్రవక్తలూ ఉన్నారు - సత్యాన్నీ, అసలైన దాన్నీ వదిలి పెడత్రోవని పట్టిన వాళ్లని శపిస్తారు! మీ ఇరువురి మధ్యా ఎంతో తేడా లేదు. ఇరువురికీ చాలా పోలిక ఉంది. మీ సిద్ధాంతాలు వేరు కావచ్చు, కాని పద్ధతి దాదాపు ఒక రకమే. మీ ఇరువురూ భావి మానవుని రక్షించటం కోసం ప్రస్తుతం ఉన్న మనిషిని త్యాగం చెయ్యాలనుకుంటారు - మీకు భవిష్యత్తు అంతా తెలిసినట్లూ, భవిష్యత్తు ఒక విధంగా నిశ్చితమైనదన్నట్లూ, దాని మీద మీకు సర్వాధికారాలూ ఉన్నట్లూ! కాని, భవిష్యత్తు గురించి ఎవరైనా సందిగ్ధంలో ఉన్నట్లే మీరు ఉన్నారు. భవిష్యత్తుని రూపొందించే ఎన్నో అభేద్యమైన సత్యాలున్నాయి ప్రస్తుతంలో. మీ ఇరువురూ ఒక ప్రతిఫలాన్నీ, ఒక ఆదర్శ వ్యవస్థనీ, ఒక ఆశ్రయాన్నీ, భవిష్యత్తులో ఇస్తామని మాటిస్తారు. కాని, భవిష్యత్తు సిద్ధాంతపూర్వకమైన నిర్ణయం కాదు. ఊహలెప్పుడూ గతాన్ని గురించీ, భవిష్యత్తు గురించే ఉంటాయి. ప్రస్తుతం గురించి ఎప్పుడూ ఉండవు. ప్రస్తుతం గురించి ఊహించలేరు. ఆచరణే జరుగుతుంది. తక్కినదంతా ఆచరణని ఆలస్యం చేయటం, ముందెప్పుడో చేయవచ్చు ననుకోవటం. అందువల్ల అది ఆచరణ కాదు. చర్య తీసుకోకుండా తప్పించుకోవటం. గతం గురించి గాని, భవిష్యత్తు గురించి కాని ఒక చర్యను ఊహించటం అంటే చర్య తీసుకోకుండా ఉండటమే. చర్య తీసుకోవటం ప్రస్తుతంలోనే జరుగుతుంది ఇప్పుడే. ఊహ ఎప్పుడూ గతం గురించిగాని,