పుట:Mana-Jeevithalu.pdf/240

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
231
మందకొడితనం

పడుతుంది. ఈలోగా నా వ్యాపారం సర్వనాశనమవుతుంది. నా కుటుంబం తిండిలేక మాడుతారు."

మీ కుటుంబ తిండిలేక మాడదు. మీరు తగినంత డబ్బు కూడబెట్టక పోయినా వారికి తిండి పెట్టే ఏర్పాటు చేయటం ఎప్పుడూ సాధ్యమవుతుంది. మీ వ్యాపారం నిస్సంశయంగా నష్టపోతుంది. కాని బ్రతుకులోని ఇతర స్థాయిల్లో కూడా విధ్వంసం జరుగుతుంది ఇప్పటికే. మీరు ఈ విధ్వంసం గురించే విచారిస్తున్నారు. మీలో ఏమవుతుందో మీరు చూడదలుచుకోలేదు. మీరు లోపలిదాన్ని లెక్కచెయ్యకుండా పై దాన్నే నిర్మించాలనుకుంటున్నారు. కాని, లోపలిదే ఎప్పుడూ పైదాన్ని అధిగమిస్తుంది. లోపలిది సంపూర్ణంగా లేకుండా పైది ఎంతోకాలం నిలవదు. కాని, లోపలిదాని సంపూర్ణత మతవ్యవస్థలోని అనుభూతిని పదేపదే పొందటం ద్వారానూ, జ్ఞానం అనే యథార్థవివరాల సమీకరణ ద్వారానూ ఏర్పడేది కాదు. బాహ్యమైనవన్నీ నిలవాలన్నా, ఆరోగ్యవంతంగా ఉండాలన్నా, ఈ అంతరంగిక ప్రయత్నాలు జరిగే పద్ధతులన్నింటినీ అవగాహన చేసుకోవాలి. మీకు తీరిక లేదని చెప్పకండి. మీకు బోలెడు తీరిక ఉంది. ఇది తీరిక లేకపోవటం అన్న విషయం కాదు, లెక్క చెయ్యకపోవటమూ, ఇష్టంలేక పోవటమూను. మీకు అంతరంగిక సంపన్నత లేదు. బాహ్య సంపన్నత వల్ల తృప్తి పొందినట్లుగానే అంతరంగిక సంపన్నత వల్ల కూడా తృప్తి పొందాలనుకుంటున్నారు. కాబట్టి మీ కుటుంబాన్ని పోషించేందుకు అవసరమైన డబ్బు కోసం మాత్రమే ప్రయత్నించటం లేదు మీరు. సొంతం చేసుకోవటంలోని తృప్తిని పొందటానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారు. ఆస్తిని గాని, జ్ఞానాన్ని గాని సొంతం చేసుకున్న వాడికి సున్నితత్వం ఉండదు. సుకుమారంగా, విశాల హృదయంతో ఉండడు. సొంతం చేసుకోవటం అంటే మందకొడిగా అవటం - ఆ సొంతం చేసుకున్నది సద్గుణం అయినా, డబ్బులైనా. ఒక వ్యక్తిని సొంతం చేసుకోవటం అంటే, ఆ వ్యక్తిని అర్థం చేసుకోలేకపోవటమే. నిజాన్ని అభిలషించి సొంతం చేసుకోవటం అంటే దాన్ని వదులుకోవటమే. సద్గుణంతో ఉండాలని ప్రయత్నించినప్పుడు మీకింక ఆ సద్గుణం ఉండదు. సద్గుణాన్ని కోరటం మరొక స్థాయిలో సంతృప్తిని పొందాలనుకోవటమే. సంతృప్తి పొందటం సద్గుణం కాదు. సద్గుణం అంటే స్వేచ్ఛ.