పుట:Mana-Jeevithalu.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కారణం, ఫలితం

227

డుగునా తెలుసుకుని, దాని మొత్తం నిర్మాణక్రమాన్ని గుర్తిస్తే బాధనుంచి విముక్తి పొందటానికి అవకాశం ఉంటుంది. బాధని తప్పించుకోవటం దాన్ని శక్తిమంతం చేయటానికే. కారణాన్ని వివరించటం వల్ల బాధనుంచి విముక్తి లభించదు. బాధ అలాగే ఉంటుంది. మాటలతో, నిర్ణయాలతో - మీవిగాని, ఇతరులవి గాని, దాన్ని కప్పి ఉంచుతారంతే. కారణాలను తెలుసుకోవటం వివేకం పొందటం కాదు. కారణాలు వివరించటం ఆగిపోయినప్పుడే వివేకం కలగటానికి అవకాశం ఉంటుంది. ఎంతో ఆత్రుతతో వెతుకుతున్న కారణాలు మిమ్మల్ని నిద్రపుచ్చేవి మీకు దొరుకుతాయి. కాని, కారణం సత్యంకాదు. ఏ విధమైన నిర్ణయాలూ, కారణాలూ, మాటలూ లేకుండా గమనించినప్పుడు సత్యం తెలుస్తుంది. గమనించేది మాటలతో తయారవుతుంది. కారణాలూ, నిర్ణయాలూ, ఖండనలూ, సమర్థనలూ మొదలైన వాటితో తయారవుతుంది 'నేను'. గమనించేది లేనప్పుడే గమనించబడే దానితో సంపర్కం ఏర్పడుతుంది అప్పుడే అవగాహన కలుగుతుంది. సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.

"ఇది గ్రహించాననుకుంటాను. కాని, కర్మ అనేదే లేదంటారా?"

మీరనే అ మాటకి అర్థం ఏమిటి?

"ప్రస్తుత పరిస్థితులు - పూర్వం, అంటే, అంతకుముందే గాని, చాలాకాలం క్రిందటగాని చేసిన కార్యాలకు ఫలితం. ఆ కారణం, ఫలితం అనే ప్రక్రియ ఎన్ని విధాలుగా ఉంటుందో అదే కర్మ అంటే" అని చెప్పాడాయన.

ఇది వివరణ మాత్రమే. ఈ మాటలన్నీ దాటి వెడదాం. ఒక నిర్ణీత ఫలితానికి ఒక నిర్ణీత కారణం ఉంటుందా? కారణం, ఫలితం నిశ్చితమైతే అది మరణం కాదా? స్థిరంగా, కదల్చటానికి వీల్లేకుండా, విశిష్టంగా ఉన్నది. మరణించి తీరుతుంది. విశిష్ట జంతువులు త్వరలోనే అంతమొందుతాయి. కాదా? మనిషి విశిష్టత లేనివాడు. అందుచేత అతడి జీవనం కొనసాగే అవకాశం ఉంది. ఎలా పడితే అలా మలచటానికి వీలయేది చాలా కాలం ఉంటుంది. మెత్తగా లేనిది విరిగిపోతుంది. సింధూరం నుంచి సింధూర వృక్షం కాక మరొకటి రాలేదు. కారణం, ఫలితం సింధూరమే. కాని, మనిషి అంతగా పూర్తిగా అన్ని వైపులా మూసుకుని, ప్రత్యేక విశిష్టతతో ఉండడు. అందువల్ల