పుట:Mana-Jeevithalu.pdf/234

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


69. కారణం, ఫలితం

"మీరు ఎందరినో బాగు చేశారని నేనెరుగుదును. నా కొడుకుని కూడా బాగుచేయరా?" అన్నాడాయన. "వాడు దాదాపు గుడ్డివాడు. కొంత మంది డాక్టర్లను సంప్రదించాను. వాళ్లేమీ చెయ్యలేరు. యూరప్ గాని, అమెరికా గాని తీసుకువెళ్లాలని సలహా ఇచ్చారు. నేను డబ్బున్నవాణ్ణి కాదు. నాకంత స్తోమత లేదు. మీరేమైనా చెయ్యరా? వాడు నాకున్న ఒక్కడే కొడుకు. నా భార్య గుండె పగిలిపోతుంది."

ఆయన ఒక చిన్న ఉద్యోగి. బీదవాడేగాని, చదువుకున్నవాడు. ఆయన బోటి వాళ్లలాగే ఆయనక్కూడా సంస్కృతం, సంస్కృత సాహిత్యం తెలుసును. అది ఆ కుర్రవాడి కర్మ, వాళ్ల కర్మ అనీ, దాన్ని అనుభవించి తీరాలి అనీ మధ్య మధ్య అంటూనే ఉన్నాడు. ఈ శిక్ష అనుభవించటానికి తాము ఏం చేశారని? అంత బాధ అనుభవించటానికి ఏం పాపం చేశారు - తమ పూర్వ జన్మలోగాని, ఇంతవరకు ఈ జన్మలోగాని? ఈ ఘోర విపత్తు రావటానికి కారణం పూర్వ కర్మలో ఏదో ఉండే ఉంటుంది.

ఈ గుడ్డితనం రావటానికి ఏదో ముఖ్య కారణం ఉండే ఉంటుంది. డాక్టర్లు ఇంకా తెలుసుకోలేక పోయారు. వారసత్వం నుంచి వచ్చినది కావచ్చు. డాక్టర్లు శారీరక కారణాన్ని కనుక్కోలేక పోయినంత మాత్రాన మీరు ఎప్పుడో గతంలో ఉండి ఉంటుందని ఊహించటానికి ప్రయత్నిస్తారెందుకు?

"కారణం తెలుసుకోవటానికి ప్రయత్నించినట్లయితే ఫలితాన్ని అర్థం చేసుకోవటానికి ఎక్కువ వీలవవచ్చు."

కారణం తెలుసుకున్నంత మాత్రాన దేన్నైనా అర్థం చేసుకుంటారా? ఎందుకు భయపడుతున్నారో తెలుసుకున్నంత మాత్రాన భయం పోతుందా? కారణం తెలిసి ఉండొచ్చు. కాని, అంతమాత్రం చేతనే అవగాహన కలుగుతుందా? కారణం తెలిస్తే ఫలితాన్ని అర్థం చేసుకోగలుగుతానని మీరు అనటంలో అర్థం ఇది దేనివల్ల వచ్చిందో తెలుసుకుని తృప్తిపొందుదామనుకుంటున్నారు, కాదా?