పుట:Mana-Jeevithalu.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

222

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

ఆలోచిస్తుంది. అవి చిన్న గొడవలు. కార్యనిర్వహణ చేసే మనిషికి పెద్ద సమస్యలతో, బాధ్యతలతో వ్యాపకం ఉంటుంది. పెద్ద సమస్యలతో, లోతైన సమస్యలతో వ్యవహరించటాన్ని కార్యనిర్వహణ, ఆచరణ అనొచ్చు - రాజకీయాల్లోనే గాక ఆధ్యాత్మికంగా కూడా. దానికి స్తోమతా, సమర్థతా, సక్రమ కృషీ, దీక్షతో ఒక లక్ష్యం కోసం పని చెయ్యటం అవసరం. అటువంటి మనిషి చింతనాపరుడూ, ఆధ్యాత్మిక శక్తి సంపన్నుడూ, యోగీ కాడు, అతడు కార్యాచరణ పరుడు."

పెద్ద పెద్ద సమస్యలతో వ్యాపకం ఉండటం కార్యాచరణ అంటారు మీరు. పెద్ద సమస్యలు అంటే ఏమిటి? దైనందిన జీవితం కాక వేరేగా ఉన్నాయా అవి? మొత్తం జీవిత ప్రక్రియతో సంబంధించకుండా కార్యాచరణ వేరుగా ఉంటుందా? అనేక అంతస్తుల్లో ఉన్న జీవితాన్ని సమైక్యం చేయకుండా కార్యాచరణ అవుతుందా? అవగాహన చేసుకోకుండా, సమస్త జీవన ప్రక్రియనీ సమైక్యం చేయకుండా జరిగే కార్యాచరణ కేవలం వినాశకరమైన కార్యకలాపం అవదూ? మనిషి సమగ్ర ప్రక్రియ. ఈ సమగ్రతలోనుంచే చర్య జరగాలి.

"అయితే దాని అర్థం చర్య తీసుకోకపోవటమే - ఎప్పుడో చెయ్యవచ్చు లెమ్మని ఊరుకోవటమే. చర్య తీసుకోవటం అత్యవసరం. దాని గురించి వేదాంతం చెబితే ప్రయోజనం లేదు."

మనం వేదాంతం చెబుతున్నామా? మీరు కార్యాచరణ అనుకుంటున్నది చెప్పలేనంత హాని కలిగించటం లేదా అనుకుంటున్నాం అంతే. పరివర్తన చేసినదాన్ని మళ్లీ ఎప్పుడూ పరివర్తన చెయ్యవలసి వస్తుంది. కొంత వరకు చర్య తీసుకోవటం సంపూర్ణ చర్యకాదు. అది వినాశానికే హేతువవుతుంది. మీకు ఓపిక ఉన్నట్లయితే, ఇప్పుడే, ముందెప్పుడోకాదు, సమగ్రమైన, సమైక్యమైన చర్య ఏమిటో గ్రహించవచ్చు.

ఒక ఉద్దేశంతో చేసేపని చర్య అవగలదా? ఒక ఉద్దేశం, ఒక ఆదర్శం ఉండటం, దాని కోసం పని చెయ్యటం చర్య అవుతుందా? చర్య ఒక ఫలితం కోసం చేస్తే అది చర్య అవుతుందా?