పుట:Mana-Jeevithalu.pdf/229

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
220
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

శక్తి సంపన్నం చేయటం. చైతన్యం, సంఘర్షణ ద్వారా ఆత్మని కేంద్రీకరించటం - ఇదే అనుభవం, పేరుపెట్టటం, పదిలపరచటం కలిసిన పూర్తి ప్రక్రియ.

"ఈ ప్రక్రియలో సంఘర్షణని రేపేదేమిటి? సంఘర్షణ నుంచి విముక్తి కాగలమా? సంఘర్షణకు ఆవల ఉన్నదేమిటి?"

పేరుపెట్టటమే సంఘర్షణకు దారితీస్తుంది. కాదా? ఏ సమస్యనైనా, ఏ స్థాయిలోనైనా, దాన్ని మీరు ఒక గతానుభూతితో ఒక ఊహతో ఒక నిర్ణయంతో, ఒక దురభిప్రాయంతో సమీపిస్తారు. అంటే, అ అనుభవానికి ఒక పేరు పెడుతున్నారు. ఈ పేరు పెట్టటం అనుభవానికి ఒక లక్షణాన్ని ఇస్తుంది. పేరు పెట్టటంలోంచే లక్షణం వస్తుంది. పేరు పెట్టటం అంటే జ్ఞాపకంగా దాచుకోవటం. గతం కొత్తదాన్ని కలుసుకుంటుంది. సమస్యని జ్ఞాపకం, అంటే గతం కలుస్తుంది. గతం యొక్క ప్రతిక్రియ సజీవమైన కొత్త సమస్యని అర్థం చేసుకోలేదు. గతం యొక్క ప్రతిక్రియలు సరిపోవు. దీంతో సంఘర్షణ ఉద్భవిస్తుంది. అదే ఆత్మ చైతన్యం. పేరు పెట్టటం అనేది లేనప్పుడు సంఘర్షణ ఆగిపోతుంది. ప్రతిక్రియతో బాటు పేరు పెట్టటం ఒకేసారి మీలో ఎలా జరుగుతుందో మిమ్మల్ని మీరు పరీక్షగా గమనించుకోండి. ప్రతిక్రియకీ, పేరు పెట్టటానికీ మధ్యనుండే విరామమే అనుభవించటం. అనుభవించేది గాని, అనుభవంగాని లేకుండా అనుభవించటం సంఘర్షణకి అతీతమైనది. సంఘర్షణ అంటే ఆత్మ కేంద్రీకరణం. సంఘర్షణ ఆగిపోవటంతో ఆలోచనలన్నీ అంతమవుతాయి. అనంతమైనది ఆరంభమవుతుంది.

68. ప్రయోజనం లేని చర్య

ఆయన ఎన్నో వివిధ రకాల సంస్థల్లో ఉన్నాడు. అన్నిటిలోనూ చురుకుగా పనిచేశాడు. ఆయన రచించాడు, ప్రసంగించాడు, డబ్బుపోగు చేశాడు, సంస్థలను నడిపాడు. ఆయన శక్తిమంతంగా, పట్టుదలగా, సమర్ధవంతంగా ఉంటాడు. ఆయన చాలా ఉపయోగకరమైనవాడు. ఆయన అవసరం అందరికీ ఉంటుంది. ఎప్పుడూ దేశంలో ఇటూ అటూ తిరుగుతూ ఉంటాడు. ఆయన రాజకీయ ఉద్యమాల్లో పాల్గొన్నాడు, జైలుకి వెళ్లాడు,