పుట:Mana-Jeevithalu.pdf/226

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
217
కోరిక, సంఘర్షణ

ఉన్నస్థితి చెప్పే కథని వింటూంటే దానంతట అదే విముక్తి పొందుతుంది. సత్యమే విముక్తి కలిగిస్తుంది - స్వేచ్ఛగా ఉండాలని చేసే ప్రయత్నం కాదు.

67. కోరిక, సంఘర్షణ

వాళ్లంతా కలిసి ముచ్చట గొల్పుతున్నారు. అందులో చాలా మంది ఉత్సాహంగా వింటున్నారు. కొంతమంది ఖండించటం కోసమే వింటున్నారు. వినటం అనే కళ అంత సులభంగా రాదు. అందులో అందం ఉంటుంది. గొప్ప అవగాహన ఉంటుంది. మనలోని ఎన్నో లోతుల్లోంచి వింటాం. కాని, మనం వినటం ఎప్పుడూ అంతకు ముందు గ్రహించిన దానితోనూ, లేదా, ఒక ప్రత్యేక దృష్టితోనూ మాత్రమే. ఊరికే వినం. మధ్యలో ఎప్పుడూ మన సొంత ఆలోచనలూ, నిర్ణయాలూ, దురభిప్రాయాలూ తెరలా అడ్డు నిలుస్తాయి. మనం సంతోషంతో గాని, ప్రతిఘటిస్తూగాని, గ్రహిస్తూగాని, తిరస్కరిస్తూగాని వింటాం. కాని, వినటం ఉండదు. వినటానికి అంతరంగంలో నిశ్శబ్దం, సేకరణ భారంలేని స్వేచ్ఛ, విశ్రాంతితో కూడిన ధ్యానం ఉండాలి. ఈ మెలకువగా అనాసక్తంగా ఉండే స్థితిలో మాటల్లో నిర్ణయించటానికతీతమైన దాన్ని వినగలుగుతాం. మాటలు గందరగోళంగా ఉంటాయి. బయటికి తెలియజేయటానికి అదొక్కటే మార్గం. మాటల ధ్వనికి అతీతమైన సంపర్కం కలగటానికి వినటంలో మెలకువగానూ, అనాసక్తంగానూ ఉండాలి. ఇష్టం ఉన్నవాళ్లు వినొచ్చు. కాని, వినేవాళ్లు దొరకటం చాలా అరుదు. మనలో చాలా మంది ఫలితాల వెంట పడతారు; లక్ష్యాలు సాధిస్తూ, నిరంతరం తప్పించుకుంటూ, జయిస్తూ ఉంటారు. అందుకే వినటం ఉండదు. వింటున్నప్పుడే ఎవరికైనా మాటల్లోని పాట వినిపిస్తుంది.

"కోరిక నుంచి విముక్తి పొందటం సాధ్యమేనా? కోరిక లేకుండా జీవితం ఉంటుందా? కోరికే జీవితం కాదా? కోరిక నుంచి విముక్తి పొందాలనుకోవటం మరణాన్ని ఆహ్వానించటమే. కాదా?"

కోరిక అంటే ఏమిటి? దాని గురించి ఎప్పుడు తెలుస్తుంది మనకి?