పుట:Mana-Jeevithalu.pdf/225

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
216
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

యొక్క ప్రతిక్రియే ఆలోచన.

"ఆలోచన అంటే అంతేనా? జ్ఞాపకానికి ప్రతిక్రియగానే కాక ఆలోచనలో అంతకన్న ఎక్కువ ప్రగాఢమైనవి లేవా?"

ఆలోచన తన్నుతాను వివిధ స్థాయిల్లో పెట్టుకోగలదు, పెట్టుకుంటుంది - తెలివి తక్కువ అనీ, ప్రగాఢం అనీ, ఉన్నతమనీ, నీచమనీ. అయినా, అదంతా ఆలోచనే, కాదా? దేవుడి గురించి ఆలోచన మనస్సులోనిదే, మాటల్లోనిదే. దేవుడి గురించి ఆలోచన దేవుడు కాదు. అది జ్ఞాపకం యొక్క ప్రతిక్రియ మాత్రమే. జ్ఞాపకం చాలా కాలంపాటు ఉంటుంది. అందువల్ల అది ప్రగాఢమైనది అనిపించవచ్చు. కాని, స్వతస్సిద్ధంగా అది లోతైనది ఎన్నటికీ కాలేదు. జ్ఞాపకం దాగి ఉండవచ్చు, పైకి వెంటనే కనిపించకుండా. అంత మాత్రం చేత అది ప్రగాఢం కాదు. ఆలోచన ఎన్నటికీ ప్రగాఢం కాలేదు. అది ఉన్న దాని కన్న ఎక్కువ ఏమీ కాలేదు. ఆలోచన తనకు తాను ఎంతో విలువనిచ్చుకోవచ్చును, కాని అది ఆలోచనే. స్వయంకల్పితమైన దానితో మనస్సు వ్యాపకంపెట్టుకోవటం ఆలోచనకతీతంగా పోవటం కాదు. ఒక కొత్త పాత్ర వహిస్తుందంతే - ఒక కొత్తవేషం. వేషంలో ఉన్నది ఆలోచనే.

"అయితే, ఆలోచనకి ఎవరైనా అతీతంగా పోవటం ఎలా?"

అది కాదు ఆసలు విషయం. అవునా? ఆలోచనకి అతీతంగా ఎవరూ పోలేరు. ఆ "ఎవరు" అనే "ప్రయత్నం చేసేవాడు" ఆలోచన ఫలితమే. ఆలోచనా ప్రక్రియని అర్థం చేసుకోవటంతో, అంటే ఆత్మ జ్ఞానం ఉండటంతో ఉన్నస్థితి అనే సత్యం ఆలోచనా ప్రక్రియని అంతం చేస్తుంది. ఉన్నస్థితి అనే సత్యం ఏ పుస్తకాల్లోనూ ప్రాచీనమైనవిగాని, ఆధునికమైనవిగాని - వేటిలోనూ దొరకదు."

"అయితే సత్యాన్ని ఎలా కనుక్కోవటం?"

ఎవరూ కనుక్కోలేరు. సత్యాన్ని కనుక్కునేందుకు చేసే ప్రయత్నం స్వయం కల్పిత లక్ష్యాన్ని తెస్తుంది. ఫలితం విస్తృతమైన, కల్పితమైన ఆలోచన కొనసాగటమే. ఆలోచన అంతమైనప్పుడే సత్యం ఉంటుంది. బలవంతం మీదా, క్రమశిక్షణవల్లా, ఏవిధమైన ప్రతిఘటనవల్లా ఆలోచన అంతం కాదు.