పుట:Mana-Jeevithalu.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

212

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

దానిలో సువాసన ఎక్కడా ఉండదు. ఆలోచన ప్రస్తుతంలోంచి భవిష్యత్తులోకి వెళ్లి మళ్లీ వెనక్కి వస్తుంది. గుంజకి కట్టేస్తే పిచ్చెత్తిన పశువులా, దానికున్న కైవారంలో - చిన్నదైనా, పెద్దదైనా, కదులుతూ ఉంటుంది. దాని నీడని అది ఎన్నటికీ తప్పించుకోలేదు. ఈ కదలికే గతం గురించీ, ప్రస్తుతం గురించీ, భవష్యత్తు గురించీ మనస్సు యొక్క వ్యాపకం. మనస్సే వ్యాపకం. మనస్సుకి వ్యాపకం లేనట్లయితే అది బ్రతకటం ఆగిపోతుంది. దాని వ్యాపకమే దాని బ్రతుకు. అవమానం, పొగడ్త, దేవుడు, తాగుడు, సద్గుణం, ఆవేశం, పని, వ్యక్తం చేయటం. పదిలపరచటం, ఇవ్వటం - వీటన్నిటితో ఉండే వ్యాపకం ఒక్కటే. అప్పటికీ అది వ్యాపకమే, వ్యాకులపడటమే, అశాంతిగా ఉండటమే. దేనితోనో ఒకదానితో సామానుతోనో, దేవుడితోనో వ్యాపకం పెట్టుకుని అల్పత్వం, వెలితి ఉండే స్థితిలో ఉంటుంది.

వ్యాపకం మనస్సుకి ఒక కార్యకలాపం ఉన్నట్లూ, జీవించి ఉన్నట్లూ భావన కలిగిస్తుంది. అందువల్లనే మనస్సు దాన్ని అంటి పెట్టుకుంటుంది. లేదా పరిత్యజిస్తుంది. వ్యాపకంతోనే తన్నుతాను పోషించుకుంటుంది. మనస్సు దేనితోనో ఒక దానితో హడావిడిగా ఉండాలి - దేనితో హడావిడిగా ఉందన్నది ముఖ్యం కాదు. ముఖ్యమైన దేమిటంటే, దానికి వ్యాపకం ఉండాలి. మంచి వ్యాపకాలకు సాంఘిక ప్రాధాన్యం ఉంటుంది. దేనితోనైనా వ్యాపకం పెట్టుకోవటం మనస్సుకి సహజం. దాని కార్యకలాపం దీన్నుంచే బయలుదేరుతుంది - దేవుడితో, ప్రభుత్వంతో, జ్ఞానంతో వ్యాపకం పెట్టుకోవటం. అల్పమనస్సు యొక్క కార్యకలాపం. దేనితోనైనా వ్యాపకం పెట్టుకోవటంలో పరిమితత్వం ఉంటుంది. మనస్సుకి చెందిన దైవం అల్పదైవం - దాన్ని ఎంత ఉన్నత స్థానంలో ఉంచినా. వ్యాపకం లేకపోతే మనస్సే ఉండదు. ఉండనేమోనన్న భయం మనస్సుని విశ్రాంతి లేకుండా పనిలో మునిగి ఉండేటట్లు చేస్తుంది. ఈ విరామం లేని కార్యకలాపం జీవితంలా కనిపిస్తుంది. కాని, అది జీవితం కాదు. అది ఎప్పుడూ మరణానికి దారి తీస్తుంది - మరణం కూడా అదే రకమైన కార్యకలాపం - మరోరూపంలో.

కల మనస్సుకి మరో వ్యాపకం. దానికి విశ్రాంతి లేకపోవటానికి అదొక చిహ్నం. కలకనటం కూడా చైతన్యావస్థ కొనసాగటమే. మెలుకువగా